Akbaruddin Owaisi: నాపై మళ్లీ తూటాల వర్షం కురిపించండి, కత్తులతో పొడవండి కానీ!: అక్బరుద్దీన్ ఒవైసీ
Hydra To Demolish Owaisi Properties | హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమిత స్థలాల్లో నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. అయితే తమ విద్యాసంస్థలను కూల్చివేయవద్దని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
MIM MLA Akbaruddin Owaisi | హైదరాబాద్: చెరువులు, ఇతర జలాశయాల కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో హైడ్రా దూసుకెళ్తోంది. ఇటీవల టాలీవుడ్ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు సహా పలువురు ప్రముఖుల భవనాలు, నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. తరువాతి టార్గెట్ ఒవైసీ సోదరులు అని, పాతబస్తీలోని సలకం చెరువులో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైడ్రా కూల్చివేతలపై ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ లో పలు ప్రభుత్వ ఆఫీసులు, కార్యాలయాలు చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయని.. వాటిని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేస్తుందా అని అసదుద్దీన్ ప్రశ్నించారు.
విద్యాసంస్థల జోలికి రావొద్దన్న అక్బరుద్దీన్
కావాలంటే తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించాలని, అయితే ఆ స్కూల్స్, విద్యా సంస్థలు మాత్రం కూల్చవద్దు అంటూ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగ్స్ నిర్మించినట్లు చెప్పారు. వాటిని కొందరు తప్పుగా చిత్రీకరిస్తున్నారని, పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడవద్దని కోరారు. గతంలో తనపై కొందరు కాల్పులు జరిగారని, ఇప్పుడు కావాలంటే మళ్లీ తనపై బుల్లెట్ల వర్షం కురిపించండి, లేకపోతే కత్తులతో దాడి చేయండి కానీ ఆ స్కూల్ బిల్డింగ్ కూల్చవద్దు అంటూ తాజాగా హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఇలా స్పందించారు.
తనపై పగ తీర్చుకోవాలంటే వ్యక్తిగతంగా, తనతో పోరాడాలని, ఏమైనా చేసుకోవాలని.. కానీ తాను చేసే మంచి పనుల్ని మాత్రం అడ్డుకోవద్దు అన్నారు. తన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ల కోసం కృషి చేస్తున్నానని, వారి కోసం చేస్తున్న మంచి పనుల్ని ఆపవద్దన్నారు. తన విద్యాసంస్థల జోలికి రావొద్దని, వస్తే మంచిది కాదని హెచ్చరించారు. మంచి చేయడం, ప్రేమను పంచడం తమ పని అన్నారు.
హైడ్రా కూల్చివేతలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ భవనాలు, ఆఫీసులను కూడా హైడ్రా కూల్చేస్తుందా అని ప్రశ్నించారు. నీటి కుంట వద్ద ఉన్న జీహెచ్ఏంసీ ప్రధాన కార్యాలయం కూల్చేస్తారా? ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నెక్లెస్ రోడ్ కూల్చేస్తారా? కేంద్రానికి సంబంధించిన CCMB ఆఫీస్ హిమాయత్ సాగర్ వద్ద ఉందని, వీటిని కూల్చేస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న ప్రభుత్వ భవనాలను కూల్చివేస్తారా? గోల్కొండలోని చెరువులో ఉన్న గోల్ఫ్ కోర్టులో ఐఏఎస్, ఐపీఎస్ లు కనిపిస్తారని.. అది కూడా కూల్చేస్తారో లేదో తేల్చాలన్నారు. ఎల్‌టీఎఫ్ సమస్యపై తేల్చాలని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీని కలిసి మాట్లాడామన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముస్లింల వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో బిల్లుకు వెళ్తుండటాన్ని ఆయన తీవ్రం వ్యతిరేకించారు.
Also Read: ఢిల్లీకి బీఆర్ఎస్ బలగం - మంగళవారం కవితకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతోనే ?