Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి - శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది
పై అంతస్తులో బట్టలు షాపు ఉండడంతో అక్కడికి కూడా మంటలు వ్యాపించాయని అగ్ని మాపక అధికారులు తెలిపారు. పొగ వ్యాపించిన కారణంగా అగ్ని మాపక సిబ్బంది పై ఫ్లోర్‌లకి వెళ్లడానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సికింద్రాబాద్‌లో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. రాంగోపాల్‌పేట్ లోని డెక్కన్ నైట్ వేర్ కార్ల విడి భాగాల షాపులో ఈ ఘటన జరిగింది. మంటలు తీవ్ర స్థాయిలో చెలరేగి షాపులోని వస్తువులు మొత్తం దహించుకుపోయాయి. మంటల కన్నా పొగ అధికంగా రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. గురువారం (జనవరి 19) ఉదయం సుమారు 10.30 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది.
అదే భవనంలోని పై అంతస్తులో బట్టలు షాపు ఉండడంతో అక్కడికి కూడా మంటలు వ్యాపించాయని అగ్ని మాపక అధికారులు తెలిపారు. పొగ వ్యాపించిన కారణంగా అగ్ని మాపక సిబ్బంది పై ఫ్లోర్‌లకి వెళ్లడానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పై అంతస్తుల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి అగ్ని మాపక సిబ్బంది క్రేన్లను ఉపయోగిస్తున్నారు. వసీం, జావెద్, జకీర్ అనే ముగ్గురు వ్యక్తులు మొదటి అంతస్తులో చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ సిబ్బంది ఇప్పటికి నలుగురిని రక్షించినట్లు తెలిసింది.
రెండు నెలల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రూబీ మోటార్స్ అనే ఎలక్ట్రిక్ బైక్ ల షోరూంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ అగ్నిప్రమాదాన్ని తాజా ఘటన తలపిస్తుంది. ఆ ఘటనలో లోపల ఇరుక్కున్న మనుషులు మంటల వల్ల కాకుండా దట్టమైన పొగతో ఊపిరి ఆడక చనిపోయారు.
ఘటన స్థలానికి మంత్రి తలసాని శ్రీనివాస్
ఉదయం 10 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగ్గా మధ్యాహ్నం 2 గంటలకు కూడా భవనంలో మంటలు అదుపులోకి రాలేదు. పైగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదానికి కేంద్రం అయిన భవనం మాత్రమే కాకుండా పొరుగు బిల్డింగులకు కూడా మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పడానికి దాదాపు ఆరు ఫైర్ ఇంజిన్లతో అగ్ని మాపక సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు. ఘటనా స్థలం వద్దకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణ నష్టాన్ని గుర్తించలేదని మంత్రి తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని చెప్పారు. రెస్క్యూ కొనసాగుతోందని, మంటలను త్వరలోనే అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.