అందరి మద్దతుతో పోటీ చేస్తున్నా గెలిపించండి- కాంగ్రెస్ నేతలకు మల్లికార్జున్ ఖర్గే వినతి
Mallikharjun Kharge: అందరి మద్దతుతోనే ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని, అందరూ తనను ఆదరించాలని మల్లికార్జున్ ఖర్గే కోరారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాని అందరిని కలుస్తున్నట్టు తెలిపారు.
Mallikharjun Kharge: దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తోందని ఏఐసీసీ అధ్యక్ష పదవి అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అందరి మద్దతుతో పోటీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో భాగంగానే అన్ని రాష్ట్రాలకు వెళ్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అహ్మదాబాద్, ముంబై వెళ్ళినట్లు మల్లికార్జన్ ఖర్గే పేర్కొన్నారు.
ఈనెల 17వ తేదీన ఎన్నికలు.. మద్దతివ్వండి!
కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిలో చాలా మంది నేతలు పని చేశారని.. గాంధీ కుటుంబమే కాకుండా ఇతర నాయకులు కూడా ప్రెసిడెంట్ అయ్యారని మల్లికార్జున్ ఖర్గే గుర్తు చేశారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఈ పదవిలో ఉన్నారని.. తాను కూడా అదే బాటులో నడుస్తానని వివరించారు. ఈనెల 17వ తేదీన ఏఐసీసీ ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయని... దేశ వ్యాప్తంగా 9వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతా తనుకు ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
మోదీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ నడిపిస్తుందని ఆరోపించారు ఖర్గే. ప్రధాని మోడీ దేశ సంపదను ఆగం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగిపోయిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ తోపాటు పిల్లల వాడే పెన్సిల్ ధరలను కూడా విపరీతంగా పెంచారన్నారు.
ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా మారిన ఏం ఉపయోగం లేదు..
ఇప్పటి వరకు మోడీ నియంత పాలనపై సోనియా గాంధీ పోరాటం చేశారని.. తాను కూడా అదే పంథాలో పోరాటం చేస్తానని మల్లికార్జున్ ఖర్గే వివరించారు. తనకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా పార్టీలు ఉన్నాయన్న ఆయన... అందులో కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. అయితే వాటితో ఎలాంటి లాభం లేదని చెప్పారు. టీఎంసీ.. ఏఐటీఎంసీ, ఏడీఎంకే, ఏఐడీఎంకేగా మారాయి కానీ బయట ఒక్కసీటు కూడా గెలవలేదని విమర్శించారు. టీఆరెస్ బిఆర్ఎస్ గా మారినా అదే పరిస్థితి ఎదురవుతుందని జోస్యం చెప్పారు.
బీజేపీ అధ్యక్ష పదవికి ఎప్పుడైనా ఎన్నికలు పెట్టారా..?
బీజేపీ ప్రెసిడెంట్లు ఎలా ఎన్నికవుతున్నారని.. ఇప్పటి వరకు అధ్యక్షులుగా సాగిన జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్‌సింగ్ ఎలా అధ్యక్ష పదవిలోకి వచ్చారో చెప్పాలన్నారు. వారేమైనా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారా అంటూ ప్రశ్నించారు. ఈ ఉదయమే ఆయన హైదరాబాద్ వచ్చారు. బేగంపేట విమానానశ్రయంలో దిగిన ఆయనకు రాష్ట్ర నేతలు పెద్ద ఎత్తున స్వాగనం పలికారు. అనంతరం ఆయనను గాంధీ భవన్ కు తీసుకెళ్లారు. అక్కడే నేతలతో సమావేశమైన ఖర్గే తనను గెలిపించాలని కోరారు.