Maganti Gopinath Funeral: అధికారిక లాంఛనాలతో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు: కేటీఆర్
BRS MLA Maganti Gopinath | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్య సమస్యలతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నేడు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈరోజే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నాం, మధ్యాహ్నం 3 నుంచి 4 మధ్యలో రాహుకాలం (4.30) వచ్చేలోపే మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. వారికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తక్కువ సమయం ఉంది కనుక అందరూ సహకరించాలని కేటీఆర్ కోరారు.
‘సోదరుడు, మృదు స్వభావి మాగంటి గోపీనాథ్ ఈ రోజు ఉదయం మృతి చెందడం చాలా బాధాకరం. మనం మంచినాయకుడిని కోల్పోయాం. వారి నివాసం నుంచి ర్యాలీగా అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. అందరూ సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నందుకు ధన్యవాదాలు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్న మాగంటి గోపినాథ్ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. సోదరుడు గత కొంత కాలంగా అస్వస్థతతో ఉన్నారు. ఆయన త్వరగా కోలుకుంటున్నారని భావించిన మాకు షాకింగ్ న్యూస్ తెలిసింది. ఈరోజు ఉదయాన్నే డాక్టర్స్ మాగంటి మృతి వార్తను చెప్పారు. అలాంటి నేతను కోల్పోవడం బాధాకరం’ అని కేటీఆర్ అన్నారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.
— BRS Party (@BRSparty) June 8, 2025
సోదరుడు, మృదు స్వభావి అయిన ఆయన ఈ రోజు ఉదయం మృతి చెందడం చాలా బాధాకరం. మనం ఒక మంచి నాయకుడిని కోల్పోయాం.
హైదరాబాద్ అభివృద్ధిలో మాగంటి గోపీనాథ్ గారు కీలక పాత్ర పోషించారు.
వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈరోజే… pic.twitter.com/G6GcmDDRDW
ఆదివారం ఉదయం కన్నుమూసిన మాగంటి
జూన్ 5న గుండెపోటుతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. సీపీఆర్ చేయడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారన్న ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అపస్మారక స్థితి నుంచి బయటకు రాకపోవడంతో డాక్టర్లు ఎమ్మెల్యే మాగంటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున 5.45 నిమిషాలకు మాగంటి గోపినాథ్ తుదిశ్వాస విడిచారు. మాగంటి మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలుపుతున్నారు. ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలుపుతున్నారు.






















