Erragadda Hospital: ప్రాణాలు తీసింది పాయసం కాదు..! ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటనలో కీలక అప్ డేట్
ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఇటీవల సంచలనం సృష్టించిన ఫుడ్ పాయిజన్ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాయసం తినడం వల్లనే 92 మంది అస్వస్దత , ఓ వ్యక్తి మృతి చెందడం వెనుక అసలు విషయం అదికాదట..

Erragadda Mental Hospital | హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో ఆరోజు ఏం జరిగింది. ఐదు రోజుల క్రితం ఓకేసారి 92మంది మానసిక రోగులకు వాంతులు, విరేచనాలు. ఒక్కసారిగా కొందిరిలో బిపి డౌన్ అవ్వడం, విషమ పరిస్దితికి చేరుకోవడం, ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంతకీ ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది అనే సందేహం ఇంకా వెంటాడుతోంది. ప్రాథమికంగా అందరూ పాయసం తినడం వల్లనే అని అనుకున్నారు. కానీ తరువాత విచారణలో తాజాగా కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఫుడ్ పాయిజన్ ప్రభావం అస్వస్దతకు గురైన కొందరిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలోనే ఉంచి చికిత్స అందించారు. చికిత్స పొందుతున్నవారిలో కరణ్ అనే వ్యక్తి మృతి చెందడంతో నిర్లక్ష్యం కారణంగా ఫుడ్ పాయిజన్ జరిగిందా, లేక మానసిక రోగులపై ఎవరైనా కావాలనే విషప్రయోగం చేశారనే అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం జరిగింది.
ఏబీపీ దేశంతో ఎర్రగడ్డ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ అనిత ఏమన్నారంటే..?
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 2వ తేదిన ఆసుపత్రిలో మానసిక రోగులకు ప్రత్యేకంగా వడ్డించిన పాయసం తినడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగిందని అంతా అనుకున్నారు. కానీ పాయసం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ జరగలేదని ప్రాథమిక నిర్దారణకు వచ్చాం. అందుకు కారణం అదే రోజు ఆసుపత్రిలో మిగతా స్టాఫ్ కూడా పాయసం తిన్నారు. నేను కూడా తిన్నాను.కానీ ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. రాష్ట్ర ఆవిర్బావం దినోత్సవం రోజు పాయసంతో పాటు సొరకాయ రోటిపచ్చడి, పప్పు, సాంబారులో వేటిలో ఏదైనా కంటామినేషన్ జరిగినట్లు అనుమానిస్తున్నాము. ఇప్పటికే సాంపిల్స్ ల్యాబ్ కు పంపాము. రిపోర్ట్స్ రావాల్సి ఉంది.
జీహెచ్ ఏంసీ సరఫరా చేస్తున్న నల్లా నీటిని నేరుగా ఆర్వో ట్యాంక్ ల ద్వారా ఆసుపత్రిలో మానసిక రోగులకు తాగునీటి సరఫరా జరగుతోంది. ఈ క్రమంలో ట్యాప్ వాటర్ కలుషితమైతే , ఆ ప్రభావం ఇతర ప్రాంతాలలో కూడా ఉండేది , కానీ అలా జరగలేదు.ఆసుపత్రిలో ఉన్న వందలాది మంది మానసిక రోగులు సైతం అదేనీటిని తాగుతారు. కానీ ఎవరికీ అనారోగ్య సమస్యలు, వాంతులు, విరేచనాలు కాలేదు. నీటి వల్ల కంటామినేషన్ జరగలేదనే క్లారిటీకి వచ్చామన్నారు.
ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో మొత్తం 312 మంది మానసిక రోగులున్నారు. వీరిలో కంటామినేషన్ జరిగినరోజు 92మంది అస్వస్దతకు గురైతే వారిలో 23 మంది పరిస్దితి విషమంగా ఉండటంతో వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి , చికిత్సనందించగా తాజాగా 17మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఉస్మానియాలో కేవలం ఆరుగురు మానసిక రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. మిగతావారి ఆరోగ్య పరిస్దితి నిలకడగా ఉందన్నారు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిత..
కొత్తవారితో ఫుడ్ సరఫరా.. మినరల్ వాటర్ సప్లై
ఘటన తరువాత నుండి రోగులకు మినరల్ వాటర్ సరఫరా చేస్తున్నాము. కంటామినేషన్ ఎలా జరిగింది, నిర్లక్ష్యం ఎవరిది అనే విషయాలు ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే రోగుల నుండి స్టూల్స్, ఫుడ్ సాంపిల్స్ ల్యాబొరెటిరీకి పంపాము. ఉస్మానియా ఆసుపత్రి నుండి ప్రత్యేక వైద్యబృందాలు, ఘటన జరిగిన నాటి నుండి ఆసుపత్రిలోనే ఉండి ఎప్పటికప్పుడు మానసిక రోగుల ఆరోగ్యపరిస్దితిని తెలుసుకుంటున్నారు. ఘటన జరిగిన తరువాత ఆసుపత్రికి ఫుడ్ సరఫరా చేసే కాంట్రాక్టర్ ను మార్చి , కొత్తవారితో ఫుడ్ సరఫరా చేయిస్తున్నాము. ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఆసుపత్రి ఆర్ ఎంఓ పద్మను విధుల నుండి తాత్కాలికంగా తప్పించి , డాక్టర్ శంకర్ కు ఇన్ ఛార్జ్ బాధ్యతలిచ్చారు.
అస్వస్దతకు గురైన 92మందిలో మృతి చెందిన కరణ్, కంటామినేషన్ వల్ల చనిపోలేదన్నారు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిత. వాంతులు, విరేచనాలు అవ్వడం వల్ల నీరసం వస్తుందే తప్ప , ప్రాణాలు కోల్పోయే పరిస్దితి ఉండదంటున్నారు. కరణ్ మృతికి కారణం గతంలో అతనికున్న అనారోగ్య సమస్యలేనంటున్నారు. నిర్లక్ష్యం ఎవరిది తేలాలంటే ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చాక మాత్రమే పూర్తి స్దాయిలో క్లారిటీ వస్తుందన్నారు.
ఆరోజు స్పెషల్ గా వండిన పాయసం, త్రాగునీటి వల్ల కంటామినేషన్ జరగలేదని తాజాగా ఓ క్లారిటికీ వచ్చిన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఘటన జరిగిన రోజు 1వ తేది అస్వస్దతకు గురైతే, అదేరోజు విషయం బయటకు రాకుండా ఎందుకు గోప్యంగా ఉంచారు, మరొసటిరోజు ఓ వ్యక్తి మృతి చెందడంలో వెలుగులోకి వచ్చేవరకు దాచాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.





















