Bandi Sanjay: రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ అందుకే అంటున్నడు.. బండి సంజయ్ వ్యాఖ్యలు
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు (ఫిబ్రవరి 7) బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధుల సమావేశం జరిగింది.
‘‘అంబేడ్కర్ రాజ్యాంగమంటే కేసీఆర్‌కు గిట్టదు. కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలనుకుంటున్నడు. రిజర్వేషన్లు లేని కుటుంబ పాలనకే పరిమితమయ్యే రాజ్యాంగం తేవడమే కేసీఆర్ లక్ష్యం.’’ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు (ఫిబ్రవరి 7) బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచంద్రరావు, బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు రవిచంద్ర, ఆంటోనీ రెడ్డి, రామారావు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చట్ట, న్యాయపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కమార్ మాట్లాడారు. ‘‘ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ రాజ్యాంగాన్ని తిరగరాయాలని వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగే అవినీతి బయటకు రావొద్దనే లక్ష్యంతోనే కేసీఆర్ ప్రజలను దారి మళ్లించేందుకు జరుగుతున్న కుట్ర ఇది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెరమరుగు చేయడం అందులో భాగమే. ఏ రాజ్యాంగం మీద సీఎంగా ప్రమాణం చేశారో... అదే రాజ్యాంగం ద్వారా మరో వ్యక్తి సీఎం కాకూడదని కేసీఆర్ భావిస్తున్నరు. అందుకే రాజ్యాంగాన్ని తిరగరాయాలంటున్నడు. అంబేద్కర్ రాజ్యాంగం అంటే కేసీఆర్ కు గిట్టదు. కేసీఆర్ కొత్త రాజ్యాంగంలో రిజర్వేషన్ల ఊసే ఉండకూడదనుకుంటున్నడు.’’
‘‘ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నడు. రుణమాఫీ పూర్తిగా అమలు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నడు. తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నడు. కల్వకుంట్ల రాజ్యాంగం వస్తే తన కుటుంబం మాత్రమే రాజ్యం ఏలాలన్నది కేసీఆర్ కుట్ర. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కేసీఆర్ కు ఉన్న ఇబ్బందులేమిటో చెప్పాలి. భారత రాజ్యాంగంపై నమ్మకం లేనప్పుడు... సీఎం పీఠంపై కూర్చునే అర్హత కేసీఆర్ కు లేదు. ఏదైనా ఇబ్బందులుంటే రాజ్యాంగాన్ని సవరించుకునే అవకాశం ఉంది. ఇప్పటికి 105 సార్లు సవరణలు చేశారు. కానీ పూర్తిగా రాజ్యాంగాన్ని తిరగరాయాలని అంటున్నాడంటే కేసీఆర్ లో ఉన్న అహంకార భావం కన్పిస్తోంది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మేధావులు పూర్తి స్థాయిలో స్పందించకపోవడం బాధాకరం.’’ అని బండి సంజయ్ అన్నారు.