Kavitha Letter: బీఆర్ఎస్ కేడర్ అభిప్రాయం ముందే చెప్పిన ఏబీపీ దేశం- ఆ స్టోరీలోని అంశాలే లేఖలో పేర్కొన్న కవిత
Kavitha Letter: ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన రాజకీయ లేఖ ఇప్పుడు ప్రకంపనంసృష్టిస్తోంది. ఏబీపీ దేశం స్టోరీలోని అంశాలనే ఆమె ఎక్కువగా ప్రస్తావించారు.

BRS MLC Kavitha: మై డియర్ డాడీ అంటూ ఎమ్మెల్సీ కవిత , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన రాజకీయ లేఖ ఇప్పుడు ప్రకంపనంసృష్టిస్తోంది. అయితే ఇందులో రాసిన అంశాలు చాలా వరకు మార్చి 21వ తేదీన ఏబీపీ దేశం ( బీఆర్ఎస్ టార్గెట్ ఎవరు? నోరు మెదపని గులాబీ బాస్, అయోమయంలో పార్టీ క్యాడర్) అన్న శీర్షిక ప్రత్యేక కథనాన్ని వెబ్ సైట్లో ప్రచురించింది.
పార్టీలో ఏం జరుగుతుందన్న కోణంలో గ్రౌండ్ రిపోర్ట్ గా ఈ కథనం ఇవ్వడం జరిగింది. అందులో పార్టీ క్యాడర్, నేతల్లో ఉన్న ఆలోచనలను వివరించడం జరిగింది. కేసీఆర్ మౌనంతో పార్టీలో కొంత అయోమయం నెలకొందని, బీజేపీ విషయంలో కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నామని, ఇది పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు సృష్టిస్తుందని వివరించడం జరిగింది. అంతే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టకపోడం సరి కాదన్న అభిప్రాయం గులాబీ నేతల్లో, కార్యకర్తల్లో ఉందన్న విషయాన్ని ఈ కథనంలో చెప్పడం జరిగింది.
కాంగ్రెస్ టార్గెట్ గా రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంటే, ప్రభుత్వ వ్యతిరేకత గులాబీ పార్టీకి కాకుండా కమలం పార్టీకి కలిసి వస్తోందని, క్రమ క్రమంగా కమలం బలపడుతోందని ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్‌ను బీజేపీ ఓడించిందన్న ఉదాహరణలతో వివరించడం జరిగింది. ఈ కథనం పార్టీ ప్లీనరీకి ముందు రాయడం వల్ల, ఆ ప్లీనరీ ద్వారా పార్టీకి క్యాడర్‌కు స్పష్టమైన సంకేతం ఇస్తారా ఇవ్వారా అని ప్రశ్నిస్తూ స్టోరీ రాయడం జరిగింది. తమకు శత్రువు కాంగ్రెస్‌నా లేక బీజేపీ కూడానా, లేక బీజేపీతో కలిసి నడుస్తామా, ఇప్పుడు బీజేపీని కట్టడి చేయకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు జోరు తగ్గుతుందని ఏబీపీ దేశం కథనం పేర్కొంది.
కవిత లేఖలో ఏం ఉంది.. ఏబీపీ కథనంలో ఏం ఉంది.. చూద్దామా ?
మైడియర్ డాడీ అంటూ కవిత తన లేఖను రాశారు. మే 2వ తేదీన. అంటే ఏబీపీ దేశం ఏప్రిల్ 27న జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల ముందు రాస్తూ, వరంగల్ బహిరంగ సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు ఏం స్పష్టత ఇవ్వనున్నారు అన్న కోణంలో రాయడం జరిగింది. పార్టీ ప్లీనరీ తర్వాత కవిత లేఖ రాశారు.
ఏబీపీ దేశం ఏం రాసింది.. కవిత లేఖలో ఏం ఉందో తెలుసుకుందాం.
1. కవిత రాసిన లేఖలో 8వ పాయింట్‌లో ఏబీపీ కథనంలో పేర్కొన్నట్లు బీజేపీ విషయంలో గట్టిగా మాట్లాడాల్సి ఉంది డాడీ అని పేర్కొనడం గమనార్హం. ప్లీనరీ వేదికగా రెండు నిముషాలు మాత్రమే బీజేపీని విమర్శించారు. దీని వల్ల బీజేపీతో పొత్తు భవిష్యత్తులో పెట్టుకోవచ్చు అన్న ఊహాగానాలు కార్యకర్తలు, ప్రజల్లో నెలకొందని కవిత తన లేఖలో వివరించడం విశేషం. తనను లిక్కర్ కేసులో బీజేపీ ఇబ్బంది పెట్టిన కారణాన్ని ఆ లేఖలో కవిత తన తండ్రికి గుర్తు చేశారు.
2. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, అయితే అది బీజేపికి ఉపయోగపడి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా రూపుదిద్దుకుంటుందన్న ఆందోళనలో క్యాడర్ ఉందని తన లేఖలో కవిత , కేసీఆర్ కు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఏబీపీ దేశం తన కథనంలో రాసింది. కాంగ్రెస్ పట్ల కొంత వ్యతిరేకత ఉందని, అయితే ఆ వ్యతిరేక పవానాలను బీఆర్ఎస్ క్యాష్ చేసుకోలేకపోవడం వల్ల అది బీజేపీకి లాభం చేకూర్చుతోందని, అందుకు ఎమ్మెల్యే ఎన్నికల్లో కమలం పార్టీ గెలుపే ఉదాహరణ అని చెప్పడం జరిగింది.
3. ఇక ఈ అంశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టకపోవడం వల్ల బీజేపీకి సాయం చేస్తున్నామన్న సందేశం పార్టీలోకి బలంగా వెళ్లిందని కవిత తన లేఖలో పేర్కొంది. ఏబీపీ దేశం కథనంలోను ఇదే అంశాలను ప్రస్తావించింది.
గులాబీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడి ఏబీపీ దేశం కథనం రాసింది. గ్రౌండ్ లెవల్ లో పార్టీ పరిస్థితిని అంచనా వేసి కథనం పబ్లిష్ చేసింది. అవే అంశాలు కవిత తన లేఖలో రాయడం విశేషం.






















