Telangana New Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం, హాజరైన సీఎం కేసీఆర్
Justice Ujjal Bhuyan: తెలంగాణ రాజ్ భవన్‌లో సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు.
![Telangana New Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం, హాజరైన సీఎం కేసీఆర్ Justice ujjal bhuyan takes oath as chief justice of telangana high court by Governor tamilisai, CM KCR Presents Telangana New Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణం, హాజరైన సీఎం కేసీఆర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/28/64d4e4ddbdfaddbec18628d9f5215e0e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana High Court New Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటిదాకా ఉన్న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టు సీజేగా ట్రాన్స్ ఫర్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి సీజేకు పుష్ఫగుచ్ఛం అందించారు. దీంతో దాదాపు 8 నెలల తర్వాత సీఎం రాజ్ భవన్ కు వచ్చినట్లయింది. తొలుత రాజ్ భవన్ కు వచ్చిన కేసీఆర్ మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు.
తెలంగాణ రాజ్ భవన్‌లో సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలో రాజ్ భవన్ సమీపంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను కూడా మళ్లించారు.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 1964 ఆగస్టు 2న గువాహటీలో జన్మించారు. అక్కడ డాన్ బాస్కో హైస్కూలులో స్కూల్ ఎడ్యుకేషన్, కాటన్ కాలేజీలో ఇంటర్ ఎడ్యుకేషన్, ఢిల్లీలోని కిరోరి మాల్ కాలేజీలో డిగ్రీ చేశారు. గువాహటీ ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ, గువాహటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1991 మే 20న అసోం న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఆయన తండ్రి సుచేంద్రనాథ్ భూయాన్ సీనియర్ న్యాయవాది. అసోం అడ్వొకేట్ జనరల్‌గా కూడా పనిచేశారు.
ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులు అయ్యారు. 2013లో హైకోర్టులో పూర్తిస్థాయి జడ్జి అయ్యారు. 2019 అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ అయ్యారు. రెండేళ్ల క్రితం తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తిగా ట్రాన్స్ ఫర్ పై వచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయమూర్తుల స్థాన చలనాలకు సంబంధించి మే 17న చేసిన సిఫారసును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఆమోదించారు. ఆ మేరకు గత వారం కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)