Telangana: రైతులకు గుడ్ న్యూస్- సమగ్ర నివేదిక రాగానే రైతులకు పంట నష్టం చెల్లిస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
Telangana farmers: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఎన్నికల కోడ్ కారణంగా పంట నష్టం ఆలస్యమైందన్నారు.
Jupally Krishna Rao Reveals why govt not giving crop loss money to farmers in Telangana: హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పంట నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నివేదిక రాగానే రైతులకు ఎకరానికి రూ. 10 వేల నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని పేర్కొన్నారు.
హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్
రైతు సమస్యలు, నీటి పారుదల ప్రాజెక్ట్ లు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై చర్చించడానికి సిద్ధమా అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. ప్రాజెక్టులు, రైతు సమస్యలపై చర్చించేందుకు సమయం, తేదీ, వేదిక ఏదో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు. బీఆర్ఎస్‌కు అసలు సినిమా ముందుంది అని, బీఆర్ఎస్ హాయంలో జరిగిన అవినీతిని బయటపెడతాం, మీ తప్పులన్నీ బయట పెట్టాక తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అంటూ మండిపడ్డారు.
‘హరీష్ రావు సచివాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. గత పదేళ్లలో రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ నాయకులు ముట్టడించారు. ఇప్పుడు చేసేదేం లేక సచివాలయం ముట్టడిస్తామని అంటున్నారు. రాయలసీమకు నీళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లు అప్పగించి చూశారు. కొత్త ప్రాజెక్ట్ లను పూర్తి చేయలేదు. పాత ప్రాజెక్ట్ ల నిర్వహణను గాలికి వదిలేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2014 నుంచి బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా పంట నష్టానికి పరిహారం ఇచ్చారా? ఇన్ పుట్ సబ్సిడీ, పంటల బీమాను అమలు చేశారా ? పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీ అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రంలో నేడు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.
వరి వేస్తే ఉరి అన్నది మీరు కాదా?
బీఆర్ఎస్ నేతలకు రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? గతంలో వరి వేస్తే ఉరి అన్నది మీరు కాదా? రైతులకు వరి వేయవద్దని చెప్పి, ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో వరి వేసింది ఎవరు?. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. పంట నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. నివేదిక రాగానే రైతులకు ఎకరానికి రూ. 10 వేల నష్ట పరిహారం చెల్లిస్తాం. వచ్చే వాన కాలం సీజన్ నుంచి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం. రైతుల కష్టాలు, కడగండ్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమే. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగలేదు. గత పదేండ్లలో 6, 651 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుబాటు మీ పాపం కాదా?
వర్షం కాలం సీజన్ లో అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా. మరి ప్రాజెక్ట్ ల్లో నీళ్లు ఎందుకు నింపలేకపోయారు. మేడి గడ్డ ప్రాజెక్ట్ కుంగుబాటు బీఆర్ఎస్ నేతల పాపం కాదా.ప్రతీ నీటిని బొట్టును ఒడిసి పడితామన్నారు. కానీ సకాలంలో ప్రాజెక్ట్ లను పూర్తి చేయలేదు. కట్టిన ప్రాజెక్ట్ లు కూడా కూలీ పోయే పరిస్థితి ఉంది. పాలమూర్ - రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆదరబాదరగా పాలమూర్ - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కానీ ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారిగా మారేది కాదు. నీటిపారుదల ప్రాజెక్ట్ లే కాదు ఏ ఒక్క హామీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని’ మంత్రి జూపల్లి ఆరోపించారు.
చిత్తశుద్దితో పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి. చిప్ప చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం సీయం రేవంత్ రెడ్డి సారథ్యంలో చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను మేం నెరవేరుస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెప్పుతారు. ఉమ్మడి పాలమూర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ దేనని మంత్రి జూపల్లి అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, శంకర్, వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.