Jubilee Hills By-Elections : కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్ లొల్లి- ఒక్క సీటుకు ఆరుగురు పోటీ!
Jubilee Hills By-Elections : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం అధికార కాంగ్రెస్‌లో పానిపట్టు యుద్దమే జరుగుతోోంది.ఏకంగా అరడజను మంది బీఫామ్ కోసం క్యూకట్టారు. పార్టీ నిర్ణయం కంటే ముందే ప్రకటనలు చేేయడం ఆసక్తిగా మారింది.

Jubilee Hills By-Elections : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బైపోల్ సమరం అధికార కాంగ్రెస్ కు పంటినొప్పిగా మారింది. తియ్యాలన్నా కష్టమే, భరించాలన్నా కష్టమే అన్నట్లుగా ఉంది. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అందుకే బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచి వ్యూహాలు మొదలుపెట్టాయి.
కాంగ్రెస్ పార్టీలో మాత్రం సీటు లొల్లి ఆదిలోనే పీక్స్ కు చేరుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అరడజను మంది కాంగ్రెస్ అభ్యర్దులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం లాబియింగ్ మొదలుపెట్టేశారు. తాజాగా ఆ పార్టీనేత అజారుద్దీన్ మరో అడుగు ముందుకేసి, బరాబర్ ఈసారి కూడా జూబ్లీహిల్స్ టిక్కెట్ నాదేనంటూ మీడియా ముఖంగా ప్రకటించేశారు. అజారుద్దీన్ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్దిగా మాగంటి గోపీనాథ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అలా కాదు గట్టిగా ప్రచారం చేస్తా, నేనే గెలుస్తానంటూ సీటు ప్రకటించకముందే స్వీట్లు పంచేస్తున్నారు. అజారుద్దీన్ వ్యాఖ్యలపై టిపిసిసి ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ అదేం కుదరదు. ఇంకా ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికివ్వాలో అధిష్టానం నిర్ణయం తీసుకోలేదంటూ అజారుద్దీన్ వ్యాఖ్యలను ఖండించారు.

జూబ్లీహిల్స్ టిక్కెట్‌పై ఫిరోజ్ ఖాన్ కూడా మోజుపడ్డారు. నాకు సీటు ఇవ్వాలి. గెలిచి కాంగ్రెస్ సత్తా చూపిస్తానంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్దిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి, ఓటమిపాలైన ఫిరోజ్ ఖాన్ జూబ్లీహిల్స్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ కు సన్నిహితంగా ఉండే తనకే టిక్కెట్ కన్ఫామ్ అంటున్నారు. ఇదిలా ఉంటే పీజెాఆర్ కూతురు విజయారెడ్డి సైతం జూబ్లీహిల్స్ సీటు కోసం వాయువేగంతో దూసుకుపోతున్నారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైన విజయారెడ్డి, తన ప్రత్యర్ది దానం కాంగ్రెస్‌లోకి రావడంతో, ఆమెకు ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ జూబ్లీహిల్స్. అందుకే గట్టి లాబింగ్ మొదలుపెట్టేశాారు. తన తండ్రి చరిష్మాతో జూబ్లీహిల్స్ ఇలాకాలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటు తనకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నేత నవీన్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అటు ఎంఐఎంతో సత్సంబంధాలు ఉండటంతో సీటిస్తే గెలుపు పక్కా అంటూ అధిష్టానికి హామీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెరపైకి వచ్చింది. తాను మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, తన భార్య శ్రీదేవి యాదవ సామాజిక వర్గం కావడంతోపాటు గతంలో మేయర్‌గా చేసిన అనుభవం, గ్రేటర్ పరిధిలోని పరిచయాలతో తన గెలుపు నల్లేరుమీద నడకేనని, సీటు ఇచ్చి చూడండి అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. వీరికి తోడు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత వహీం కురేషీ కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో ఉన్నట్లు సమాచారం. ఇలా ఏకంగా అరడజను మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు ఆ టిక్కెట్ మాదంటే మాదంటూ బహిరంగ వార్ కు దిగుతున్నారు.

టిక్కెట్ పోటీ ఇలా ఉంటే, ఎమ్ ఐఎమ్ ఇచ్చిన ట్విస్ట్‌తో మైనార్టీ అభ్యర్దుల ఆశలు అడియాసలైయ్యేలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి మైనార్టీ అభ్యర్దికి టిక్కెట్ ఇస్తే , తామూ పోటీలోకి దిగుతామంటూ ఎమ్ ఐఎం అంటోంది. ఎంఐఎం తప్ప మరో పార్టీలో మైనార్టీ నేత తెరపైకి రావోద్దనే ఆలోచనతోనేే కాంగ్రెస్ లో మైనార్టీ అభర్దులకు చెక్ పెడుతోందనే వాదనలు వినిపిస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 375000 ఓట్లున్నాయి. ఇందులో మైనార్టీ ఓటర్లు 125000పైగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఎంఐఎంకు ఎదురెళ్లి ఇబ్బందుకు పడటం కంటే మైనార్టీయేతర అభ్యర్దికే సీటు కేటాయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.





















