కొండగట్టుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్- అంజనేయ స్వామి ఆలయంలో 'వారాహి'కి ప్రత్యేక పూజలు
ఈ ఉదయం హైదరాబాద్‌లోని ఇంటి నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్ కాసేపట్లో జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకోనున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలకనున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ కాన్వాయ్‌తో కొండగట్టుకు పయనమయ్యారు. కాసేపట్లో ఆయన కొండగట్టుకు చేరుకోనున్నారు. జనసేన పార్టీ ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఆయన కొండగట్టుకు వస్తున్నారు. ప్రచార వాహనానికి అంజనేయ స్వామి చెంత ప్రత్యేక పూజలు చేస్తారు. .
ఈ ఉదయం హైదరాబాద్‌లోని ఇంటి నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్ మరికాసేపట్లో జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకోనున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు భారీగా అక్కడకు చేరుకున్నారు. పవన్ తన సొంత వాహనంలో వస్తే వెనుకాల వారాహి బయల్దేరింది. పార్టీ ప్రచార రథం వారాహికి ఆంజనేయస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు పవన్ కల్యాణ్. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు చేయిస్తారు. అనంతరం ప్రచార రథంపై యాత్రకు బయల్దేరనున్నారు పవన్ కల్యాణ్.
ఈ పూజల అనంతరం పవన్ కల్యాణ్... నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టుకు వస్తారు. అక్కడ జనసేన తెలంగాణ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అక్కడే లంచ్ కూడా పవన్ చేయనున్నారు. తెలంగాణ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు... ప్రజలకు అండగా ఉండాల్సిన అంశాలపై కార్యకర్తలకు, పార్టీ లీడర్లకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
జనసేన ఎన్నికల ప్రచార వాహనం 'వారాహి' ప్రత్యేక పూజకు సర్వం సిద్ధం! మరికాసేపట్లో కొండగట్టు చేరుకోనున్న జనసేనాని @PawanKalyan గారు.#JanaSenaChaloKondagattu pic.twitter.com/9IcoC1NfDQ
— JanaSena Party (@JanaSenaParty) January 24, 2023
పార్టీ మీటింగ్ తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడి నుంచి బయల్దేరతారు. నేరుగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి అనుష్టుప్ నారసింహ యాత్ర చేపడారు. ఈ యాత్రలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని 32 నరసింహ క్షేత్రాలను దర్శించుకోనున్నారు పవన్ కల్యాణ్. ధర్మపురిలో దర్శన అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్ వస్తారు. జనసేనాని పర్యటన సందర్భంగా తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.
మరి కొద్దిసేపట్లో కొండగట్టు అంజన్న క్షేత్రానికి చేరుకొని వారాహికి ప్రత్యేక పూజలు జరపనున్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.#JanaSenaChaloKondagattu
— JanaSena Party (@JanaSenaParty) January 24, 2023
పవన్ కల్యాణ్‌కు కొండ గట్టు ఆంజనేయ స్వామి అంటే చాలా సెంటిమెంట్. ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న టైంలో పవన్ కల్యాణ్‌కు కరెంట్ షాక్ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి పవన్ కల్యాణ్ క్షేమంగా బయటపడేందుకు అంజన్న ఆశీస్సులే కారణమని పవన్ నమ్ముతారు. అందుకే అప్పటి నుంచి ఎలాంటి కార్యక్రమం చేపట్టినా అక్కడి నుంచి మొదలు పెట్టడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.
ఛలో కొండగట్టు!!
— JanaSena Party (@JanaSenaParty) January 23, 2023
రేపు (జనవరి 24న) జగిత్యాల జిల్లా, కొండగట్టు అంజన్న సన్నిధిలో జనసేన "వారాహి" వాహన పూజ జరిపించేందుకు కొండగట్టులో పర్యటించనున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan pic.twitter.com/BtIEPEDX5F
తెలంగాణలో పోటీచేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జనసేన చేస్తోంది. తెలంగాణలో కూడా పోటీచేసేందుకు క్యాడర్ సిద్ధంగా ఉండాలంటూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్లు తెలంగాణ జనసేన ఇన్ఛార్జి శంకర్ గౌడ్ వెల్లడించారు. వీరికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి అధినేతకు నివేదిక అందజేస్తారని, ఆ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటనలు ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీలోకి జనసేన నేతలే ఎక్కువగా చేరారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.. ఇది పవన్ కల్యాణ్ ను బలహీనపర్చడానికేనన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తెలంగాణలో కాపు సామాజికవర్గం ఓట్లను తమ పార్టీకి ఆకర్షించి.. కేసీఆర్ కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో కాపు సామాజికవర్గ ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజికవర్గం ఎవరికి అండగా నిలిస్తే వారికి అధికారం లభిస్తుందన్న అంచనా ఉంది. ఏపీలో కాపుల్ని ఆకట్టుకుంటే.. తెలంగాణలో ఆ వర్గం కూడా బీఆర్ఎస్‌కు అండగా ఉంటుందని కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
కారణం ఏదైనా పవన్ కల్యాణ్.. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పై తీవ్రమైన విమర్శలు చేయడం లేదు. గతంలో బీజేపీతో పొత్తు ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీ కోసం అభ్యర్థుల్ని విరమించుకున్నారు . కానీ తర్వాత పొత్తు చెడిపోయింది. గౌరవం ఇవ్వడం లేదని.. అలాంటి చోట పొత్తు ప్రశ్నే ఉండదని పవన్ తేల్చి చెప్పారు. బీజేపీ నేతలు కూడా తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పవన్ చేయబోయే రాజకీయం ఆసక్తికరంగా మారింది. పవన్ పర్యటనకు వచ్చే స్పందనను బట్టి తదుపరి నిర్ణయాలను ఆ పార్టీ నేతలు తీసుకునే అవకాశం ఉంది.