Malla Reddy IT Raids: మల్లారెడ్డిపై ముగిసిన ఐటీ రైడ్స్, త్వరలోనే ED రంగంలోకి? IT అధికారుల లేఖ!
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి ఐటీ శాఖ అధికారులు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా సేకరించిన వివరాలను అటాచ్ చేసి ఈడీకి లేఖ రాసినట్లుగా సమాచారం.
మంత్రి మల్లారెడ్డిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ముప్పేట దాడికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మూడు రోజులుగా మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై నిరంతరం కొనసాగిన ఐటీ దాడులు ముగిశాయి. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి ఐటీ శాఖ అధికారులు లేఖ రాశారు. ల్యాప్ ట్యాప్ వ్యవహారంతో పాటు ఐటీ అధికారులపై దురుసుగా వ్యవహరించడాన్ని వారు సీరియస్ గా తీసుకున్నారు. మల్లారెడ్డి సహా ఆయన బంధువుల వద్ద ఇప్పటిదాకా సీజ్ చేసిన డబ్బు, సేకరించిన పత్రాలు, బ్యాంకు లాకర్లు, పెట్టుబడులకు సంబంధించి మొత్తం సమాచారం ఐటీ అధికారులు సేకరించారు. ఈ అన్ని వివరాలను అటాచ్ చేసి ఐటీ అధికారులు ఈడీకి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది.
ల్యాప్ ట్యాప్ వ్యవహారం ఏంటంటే..
ఐటీ సోదాలు చేస్తుండగా ఈ ల్యాప్ ట్యాప్ వ్యవహారం కాస్త వివాదాస్పదం అయింది. అర్ధరాత్రి సోదాలు జరుగుతున్న సమయంలో ఇన్‌కం ట్యాక్స్ అధికారి రత్నాకర్ పట్టుకొచ్చిన ల్యాప్‌టాప్ ను మల్లారెడ్డి అనుచరులు తీసుకొని వెళ్లారు. ఇదే విషయంపై బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఐటీ అధికారి రత్నాకర్ తన ల్యాప్ ట్యాప్ కనిపించడం లేదని మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. స్టేషన్ లో ఫిర్యాదు చేశాక కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ల్యాప్ టాప్ ను గేటు దగ్గర పెట్టేందుకు యత్నించారు. ఆ ఇద్దరు వ్యక్తులను ఐటీ అధికారులు, సీఆర్పీఎఫ్ అధికారులు ప్రశ్నించారు. అయితే తన ల్యాప్ టాప్ లో ఐటీ దాడులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఉందని ఐటీ అధికారి రత్నాకర్ చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న ల్యాప్ టాప్ తనది కాదని ఐటీ అధికారి చెప్పారు. దీంతో ఆ ల్యాప్ టాప్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఐటీ అధికారులు ల్యాప్ టాప్ మర్చిపోతే తాము దానికి తీసుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించేందుకు వచ్చామని మంత్రి మల్లారెడ్డి వివరణ ఇస్తున్నారు.
65 బృందాలు సోదాలు
మూడు రోజులుగా జరిగిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్టు.. ఆధారాలు సేకరించామని ఐటీ అధికారులు పేర్కొన్నారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు తెలుస్తోంది.
భారీగా నగదు స్వాధీనం
మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో ఇప్పటి వరకు రూ.6 కోట్లకు పైగా నగదు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నటి ఐటీ సోదాల్లో రూ.4 కోట్ల 80 లక్షలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్ల 80 లక్షలు, మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటిలో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మల్లారెడ్డి బామ్మర్ది కొడుకు సంతోష్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఐటీ శాఖ అధికారులు ఈ విషయం మీద స్పందిస్తూ మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఇప్పటి వరకు చేసిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గురువారం నాటికి సోదాలు ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అన్నీ సరిగ్గానే ఉన్నాయి - మంత్రి మల్లారెడ్డి
అయితే ఈ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ... తమ ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించిన అన్ని లెక్కలు, పత్రాలు సరిగ్గానే ఉన్నాయన్నారు. తన కళాశాలలు, ఆసుపత్రులు, ఆస్తుల వివరాలను ఐటీ అధికారులకు తెలియజేశామన్నారు. ఐటీ అధికారులు ఇంకా సోదాలు చేస్తున్నారని తెలిపారు. అన్ని అనుమతులతోనే కాలేజీలు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నామన్నారు. తనకు, తన కుమారులకు ఈ సోదాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. గురువారం ఉదయానికి ఐటీ సోదాలు ముగిసే అవకాశముందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.