Hyderabad IT Companies: ఫౌడర్, ఆయిల్ కొన్న ఉద్యోగులను పీకేసిన ఐటీ కంపెనీలు- మరో 50 మందికి నోటీసులు
డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే కీలక నిందితుడు లక్ష్మీపతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన పోన్‌లో ఉన్న సమాచారం అధారంగా మరింత మందిపై ఫోకస్ పెట్టారు.
హైదరాబాద్(Hyderabad)ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చే పనిలో ఉన్నారు పోలీసులు. దొరికిన చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. ఇన్నాళ్లూ నిందితులపై ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్లు. ఇప్పుడు రూట్ మార్చారు హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police). అసలు డ్రగ్స్ వాడుతున్న వారిపై దృష్టి పెట్టారు.
విద్యార్థి మృతితో డ్రగ్స్ కేసులో స్పీడ్ పెంచిన పోలీసులు ఇప్పటికే నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో కింగ్‌పిన్‌గా ఉన్న లక్ష్మీపతిని రౌండప్ చేశారు. బీటెక్ చదువును మధ్యలోనే మానేసి డ్రగ్స్ దందాలోకి వచ్చాడీ వ్యక్తి. విశాఖలోని అరకు, గోవా నుంచి డ్రగ్స్, హుష్ ఆయిల్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో వ్యాపారం చేసేవాడు. అందులో భాగంగానే ఆయనకు చిక్కిన ఓ విద్యార్థి డ్రగ్స్‌కు బానిసై మృతి చెందాడు.
ప్రమాద తీవ్రత గుర్తించిన పోలీసులు వారం రోజులు శ్రమించి లక్ష్మీపతిని పట్టుకున్నారు. అంతకంటే ముందు ముగ్గుర్ని అరెస్టు చేశారు. వారిచ్చిన సమచారంతో లక్ష్మీపతిని అరెస్టు చేశారు. లక్ష్మీపతి అరెస్టు తర్వాత ఆయన వద్ద ఉన్న సమాచారం చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఆయన ఫోన్‌లో ఉన్న చాటింగ్స్, కాంటాక్ట్స్, కాల్ డేటా పరిశీలించిన పోలీసులు డ్రగ్స్ సంస్కృతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకున్నారు.
లక్ష్మీపతి వద్ద ఉన్న సమాచారంతో డ్రగ్స్ అమ్మేవాళ్ల కంటే కొనే వాళ్లపై ఫోకస్ పెట్టారు. వాళ్ల వివరాలు సేకరించారు. అందులో చాలా మంది ఐటీ ఉద్యోగులు ఉన్నట్టు గుర్తించారు. వాళ్లంతా పెద్ద పెద్ద సంస్థల్లో పని చేస్తున్న వారేనని నిర్దారించుకున్నారు. ఆయా సంస్థలతో మాట్లాడి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
పోలీసులు ఇచ్చిన సమాచారంతో 13 మంది ఐటీ ఉద్యోగులపై వేటు పడింది. డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నిర్దారణ కావడంతో అలాంటి ఉద్యోగాలును ఐటీ కంపెనీలు ఫైర్ చేశాయి. ఈ డ్రగ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్న మరో 50 మందికి నోటీసులు ఇచ్చాయి. అమెజాన్, ఇన్ఫోసిస్, మహేంద్ర, క్యూసాఫ్ట్, మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రేమ్ ఉపాధ్యాయ, లక్ష్మీపతి వద్ద డ్రగ్స్ కొన్నట్టు పోలీసులు నిర్దారించారు. వీళ్లంతా వీకెండ్ పార్టీలు వెళ్తున్నట్టు అక్కడ డ్రగ్స్ సేవిస్తున్నట్టు పక్కా సమచారంతో ఆ కంపెనీలు చర్యలు తీసుకున్నాయి.
ఈ డ్రగ్స్‌కు సంబంధించిన లింక్‌లు విశాఖవైపు వెళ్తున్నాయి. అక్కడే గిరిజన ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి డ్రగ్‌గా మార్చి లక్ష్మీపతి గ్యాంగ్ అమ్ముతున్నట్టు పోలీసులు నిర్దారించారు. కొన్ని సార్లు గోవా నుంచి కూడా డ్రగ్స్ తీసుకొచ్చేవాళ్లని తెలుస్తోంది. వైజాగ్ నుంచి ప్రైవేట్ బస్సుల్లో హైదరాబాద్ శివార్లకు వచ్చి అక్కడ దిగేసి టూవీలర్స్‌పై సిటీలోకి వచ్చేవాళ్లు. తీసుకొచ్చిన గంజాయి నుంచి ఆయిల్ తయారు చేసి లక్షరూపాయలకు తీసుకొచ్చిన సరకును మూడు నుంచి ఐదుల లక్షల రూపాయల వరకు అమ్మేవాళ్లని తెలుస్తోంది.