Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌ను లైట్ తీసుకుంటున్న అధిష్ఠానం! ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేసినా పట్టించుకోరా..?
Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గం ఏర్పాటులో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా యూజ్ లేదు.

Telangana Congress: దేశంలో బిజెపి జోరును తట్టుకుని మూడే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అందులోనూ తెలంగాణలో మరే ఇతర పార్టీలతో పొత్తు లేకుండా రేవంత్ ప్రభుత్వం ఏర్పడింది. కూటమి కుంపట్లకు దూరంగా తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్దితి ఇప్పుడు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేవంత్ పగ్గాలు చేపట్టిన తరువాత ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు,గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. కానీ ఆ పథకాల నుంటి ఆశించిన స్దాయిలో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికిక మైలేజ్ పొందలేక పోయారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారంణం క్షేత్రస్థాయిలో పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకునే పిసిసి కార్యవర్గమే ఇంకా ఏర్పాటు కాలేదు. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకుని తొమ్మిది నెలలు దాటినా, నేటికీ క్షేత్రస్థాయిలో కమిటీల నియామకం జరగలేదు. అలా అని తప్పు రాష్ట్ర పార్టీదా అంటే కాదు, ఇక్కడ లైట్లు వెలగాలంటే అక్కడ స్విచ్ నొక్కాలి. అలా ఢిల్లీలో స్విచ్ ఆన్ చేయించేందుకు హైదరాబాద్ నుంచి సిఎం రేవంత్ రెడ్డి, పిసిసి ఛీఫ్ అనేక సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోవాల్సిన పరిస్థితులొచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ ను ఢిల్లీ పెద్దలు లైట్ తీసుకున్నారనే స్థాయిలో పరిస్థితులు చేరాయి.
పిసిసి కార్యవర్గం ఏర్పాటుతో తీవ్ర జాప్యం..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పిసిసి కార్యవర్గంలో తమకూ చోటు దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నవారి లిస్ట్ చాంతాడంత ఉంది. అయితే అందులో ఇప్పటికే వడపోతల తరువాత ఒక్కో పదవికి మూడు పేర్లు చప్పున లిస్ట్ సిద్దం చేసింది పిసిసి. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రేపో మాపో పదవులు ప్రకటన రాబోతుందని కోటి ఆశలు పెట్టుకున్నవారు ఇప్పుడు నీరసించి విసిగిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నా కనీసం ప్రచార కమిటీ నియామకం కూడా జరగలేదు. ఆర్టీసీ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్లు వంటి రాష్ట్ర స్దాయి పదవుల నుంచి మార్కెటింగ్ కమిటీ చైర్మెన్లు, లైబ్రరీ చైర్మన్లు ఇలా నామిటేడెట్ పోస్టుల ఊసేలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచి టూ జెడ్ పీ చైర్మన్ వరకూ ఏ ఒక్కరి పేర్లు ఖరారు చేయలేదు. సిఎం రేవంత్ రెడ్డితోపాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం అనేకసార్లు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లారు. పిసిసి కార్యవర్గం లిస్ట్‌కు ఆమోదం కోసం అందుబాటులో ఉన్న పెద్దలను కలిసినా ఫలితం లేదు. ఇంకా స్విచ్ నొక్కాలంటే సమయం పడుతుందని ఢిల్లీ నుంచి వెనక్కి పంపేశారు.
మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ చిన్నచూపు..
రేవంత్ రెడ్డి సిఎం పదవి చేపట్టి ఏడాదిన్నర దాటినా, మంత్రివర్గ విస్తరణ మాత్రం అతి పెద్ద టాస్క్‌గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చినప్పుడు పడ్డ కష్టాలకంటే మంత్రివర్గ విస్తరణ కోసం పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న అవమానాలే ఎక్కువైయ్యాయనే టాక్ నడుస్తోంది. తెలంగాణ క్యాబినెట్‌లో మొత్తం 18 మంత్రి పదవులకుగానీ సిఎంతో కలపి మొత్తం 12 మంత్రి పదవులు భర్తీ అయ్యాయి. మరో ఆరు శాఖలు ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఆశావాహుల లిస్ట్ తో ఢిల్లీ చుట్టూ సిఎం రేవంత్ రెడ్డి ఎక్కే ఫ్లైట్, దిగే ఫ్లైట్ అంటూ ఎంత తిరిగినా అధిష్ఠానం పెద్దల నుంచి రేవంత్ లిస్ట్‌కు ఆమోదం దొరకలేదు. తాజాగా ఖర్గే అందుబాటులో లేరని వెనక్కు పంపించేశారు. గతంలో వెళ్లినా రాహుల్ ఉంటే కేసీ వేణుగోపాల్ ఉండరు, వాళ్లిద్దరూ ఉంటే మరొకరు ఉండరు. ఇప్పటికే ప్రతిపక్షాలు రేవంత్ ఢిల్లీ పర్యటనపై సెటైర్లు వేస్తూ ఓ రేంజ్ లో మాటల తూటాలు పేలుస్తు్న్నారు. వారి మాటలకు మరింత బలం చేకూరేలా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలూ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విపిస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే, తెలంగాణ కాంగ్రెస్ ను ఢిల్లీ పెద్దలు లైట్ తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే పదేళ్ల పాటు పార్టీ కోసం శ్రమించి, తీరా అధికారంలోకి వచ్చినా ఆశించిన పదవులు అందకపోవడంతో కింది స్థాయి క్యాడర్ లో నిస్తేజం నెలకొటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.





















