ACB Case On KTR: కేటీఆర్ పై ACB కేసు రాజకీయ కక్ష సాధింపా? కాంగ్రెస్ BRS పార్టీలకు లాభనష్టాలేంటి?
ACB Case On KTR: ఫార్ములా ఈ రేసు నిర్వహణలో అక్రమాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ రెండోసారి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారణకు పిలిపించింది.

ACB Case On KTR: ఫార్ములా ఈ రేసు నిర్వహణలో అక్రమాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ రెండోసారి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించింది. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లే అన్న ప్రచారం తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా సాగుతోంది. అయితే ఇది కాంగ్రెస్ కుట్రలో భాగమని, రాజకీయ కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంటే; అవినీతిని వెలికి తీసి, పారదర్శక ప్రభుత్వం తమదని, అందులో భాగమే ఈ విచారణలని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. అయితే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ లాభనష్టాలను అంచనా వేసుకునే ఏ పనైనా చేస్తాయన్నది మాత్రం వాస్తవం. కేటీఆర్ పై ఈ కేసు రాజకీయంలో భాగమా లేక నిజంగా అవినీతి జరిగిందా అన్నది న్యాయస్థానాలు తేల్చాల్సి ఉంది. అయితే ఈ కేసు పర్యవసానాల వల్ల రాజకీయ లాభనష్టాలు ఎలా ఉంటాయో చూద్దాం.
ఫార్ములా ఈ రేస్ కేసు వివరాలు
లండన్‌కు చెందిన 'ఫార్ములా ఈ ఆపరేషన్స్' (FEO)తో కలిసి 4 సంవత్సరాలపాటు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసును నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎఫ్‌ఈఓ, గ్రీన్‌కో గ్రూప్‌ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. మొదటి రేసు 2023 ఫిబ్రవరి 11న జరిగింది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 10న రెండో విడత రేసు జరగాల్సి ఉంది. కానీ 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండో రేసును ప్రభుత్వం రద్దు చేసింది. ఒప్పందంలోని షరతులను కాంగ్రెస్ సర్కార్ తప్పుబట్టింది. ఆర్థిక లావాదేవీలలో అవినీతి జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా విదేశీ కంపెనీకి రూ. 55 కోట్లు చెల్లించారని ఈ రేసును రద్దు చేసింది. దీనికి కారణమైన అధికారులను, నాటి మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణకు పిలిపించింది.
కేటీఆర్‌పై ప్రధాన ఆరోపణ ఏంటంటే...?
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిగా కేటీఆర్ ఈ మొత్తాన్ని హెచ్‌ఎండీఏ ద్వారా చెల్లింపులు జరపాలని ఆదేశించారని, క్యాబినెట్, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా ఈ లావాదేవీ జరిగిందన్నది ఆరోపణ. అంతే కాకుండా, ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోలేదన్నది మరో ఆరోపణ. సరైన అనుమతులు తీసుకోకపోవడం వల్ల హెచ్‌ఎండీఏకు రూ. 8.06 కోట్లు అదనపు పన్నుల భారం పడిందని ఏసీబీ తన ఫిర్యాదు పత్రంలో పేర్కొంది. దీనిపై ఇప్పటికే ఏసీబీ రెండు సార్లు మాజీ మంత్రి కేటీఆర్‌ను పిలిపించి విచారణ జరిపింది. అయితే ఈ కేసులో ఏ పార్టీకి ఏం లాభం, ఏం నష్టం జరుగుతుందో చూద్దాం.
కేటీఆర్ పై కేసు వల్ల కాంగ్రెస్ కు వచ్చే లాభం ఇదే
బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని, ఇందులో కేసీఆర్ కుటుంబ సభ్యులు భారీగా లబ్ధిపొందారని కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులపై విచారణ జరుపుతామని ప్రతీ వేదికపైనా చెప్పారు. అందుకు అనుగుణంగా, ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్టుపైన, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ పైన, హరీశ్ రావు పైన; ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటీసులు జారీ చేసి విచారణ జరిపింది. ఇది ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నామని చెప్పుకోవచ్చు. తాము చెప్పినట్లే పారదర్శకమైన పాలన అందిస్తున్నామని ప్రజలకు చెప్పుకునే అవకాశం కలుగుతుంది. పాలనలో జరిగే లోపాలను ఈ రాజకీయపరమైన కేసుల ద్వారా కప్పి పుచ్చడమే కాకుండా, ఇతర అంశాలపై ప్రజల మనసులు మళ్లించే వెసులుబాటు ఉంటుంది. అంతే కాకుండా, ఓటుకు నోటు కేసు విషయంలో తనను జైల్లో పెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకారం తీర్చుకున్నట్లవుతుంది. తద్వారా తన రాజకీయ శత్రువులకు స్పష్టమైన సంకేతం పంపే వీలు కలుగుతుంది. దీని ద్వారా ప్రతిపక్ష నేతలను, పార్టీలో తనకు పోటీగా ఉండే నేతలపైన సీఎం రేవంత్ రెడ్డి పైచేయి సాధించే వీలుంటుంది.
కేటీఆర్‌పై కేసుతో బీఆర్ఎస్‌కు కలిగే నష్టాలు
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, పార్టీలో ట్రబుల్ షూటర్ హరీశ్ రావుపై కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం, అందులో అవినీతి జరిగిందని రేవంత్ సర్కార్ ఆరోపణలు, మరోవైపు లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లి రావడం గులాబీ పార్టీని గుక్కతిప్పుకోలేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కార్ వ్యవహారంలో కేసు నమోదు కావడం పార్టీని తీవ్ర నిరాశలోకి నెడుతోంది. పార్టీలో నెంబర్ టూ నేతపై కేసులు, విచారణ పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీస్తాయి. కేటీఆర్ ప్రతిష్ఠకు మచ్చగా మారవచ్చు. పార్టీ కార్యకర్తలు నైతికంగా దెబ్బతింటారు. ఇలాంటి కేసులు, న్యాయస్థానాల చుట్టూ తిరగడంపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, బలోపేతం చేసే వ్యూహాలకు పదునుపెట్టే సమయం ఉండదు. మానసిక ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది. ఇవన్నీ వ్యక్తిగతంగా కేటీఆర్ కు, పార్టీ భవిష్యత్తుకు నష్టం కలిగించే అంశాలు.
ఈ కేసు వల్ల లాభాలు ఉన్నాయా?
ఈ కేసుల నుంచి బయటపడితే కేటీఆర్ కు పెద్ద ఎత్తున ప్రజల సానుభూతి లభిస్తుంది. అన్యాయంగా కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపిందన్న ప్రజల సానుభూతి కేటీఆర్ పై వెల్లువెత్తుతుంది. కాంగ్రెస్ రాజకీయ వేధింపులు అని ఆ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేక భావజాలాన్ని రేకెత్తించవచ్చు. "జైలుకెళతా" అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఆయన లీడర్‌షిప్‌ను బలోపేతం చేయవచ్చు. ఈ కేసులో తన తప్పు లేదని ఆధారాలు చూపి బయటపడితే ఆ పోరాట పటిమ వల్ల కేటీఆర్ పటిష్టమైన నాయకుడిగా మరింత ఎదిగే అవకాశం ఉంది. ఈ విచారణలను ఎదుర్కోవడం వల్ల బలమైన నాయకుడిగా రూపొందడం జరుగుతుంది.
తెలంగాణ రాజకీయాలపై ఈ కేసుల ప్రభావం
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ అధికార మార్పిడి చోటు చేసుకున్న తర్వాత జరుగుతున్న రాజకీయాలివి. ఇందులో అవినీతి జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే, ప్రతీకార రాజకీయాలకు మాత్రం ఇది మూలంగా చెప్పవచ్చు. ప్రతిపక్షాలను బలహీనపర్చడానికి అధికార పక్షం వాడే ఆయుధంగా రానున్న రోజుల్లో ఈ కేసులు మారవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇలాంటి కేసులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ కీలక నేతలు సైతం సిద్ధపడాల్సి వస్తుంది. ఈ వ్యవహారం అంతా తెలంగాణ రాజకీయాలపైన, రాజకీయ నాయకుల భవిష్యత్తుపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం రానున్న రోజుల్లో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.






















