Palla Rajeshwar Reddy: పల్లా రాజేశ్వర్ కాలేజీ ముందు ఉద్రిక్తత, స్థానికుల నిరసనలు
Hyderabad News: పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థ అనురాగ్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ లో కాలేజీ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు.
Anurag University: హైదరాబాద్‌లో కొద్ది వారాలుగా హైడ్రా (Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency) చేస్తున్న కూల్చివేతలు హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూడా నేలమట్టం చేశారు. ఆ తర్వాత వరుసలో బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన కాలేజీలు ఉన్నాయని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. వీరి కాలేజీలు కూడా నిబంధనలను ఉల్లంఘించి కట్టారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. చెరువు కబ్జా చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. అయితే, స్థానికులపై పల్లా అనుచరులు దౌర్జన్యం చేసినట్లు తెలిసింది. ఆ కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కాలేజీ ముందు ఎలా ధర్నా చేస్తారంటూ వారు వారించారు. స్థానికులకు, పల్లా అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి.
Victims Staged Protest that BRS MLC Palla Rajeshwar Reddy and his supporters have seized their land
— Congress for Telangana (@Congress4TS) August 26, 2024
తమ భూమిని పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు అతని అనుచరులు కబ్జా చేశారంటూ బాధితులు ఆందోళన
👉 మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ పరిధిలోని సర్వే నం.796 లోని తమ నాలుగు ఎకరాల… pic.twitter.com/82PlTWtVSz
కోర్టుకు పల్లా
పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనురాగ్ యూనివర్సిటీ అనే విద్యా సంస్థ ఉంది. దీన్ని నాదం చెరువు బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని ఫిర్యాదులు ఉన్నాయి. రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు పోలీసులు, హైడ్రా అధికారులకు దీనిపై ఫిర్యాదు చేశారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఆ భవనాలను కూడా కూల్చేస్తారని వార్తలు రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం హైకోర్టుకు వెళ్లారు. తన భవనాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టును కోరారు. స్టే ఇవ్వాలని కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు వేశారు. అయితే, చట్ట ప్రకారం నడుచుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.