Hyderebad People Dies in Saudi Bus Accident: సౌదీ బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మృతి.. ఒక్కరు మాత్రమే సేఫ్!
Hyderebad people dies in Bus Accident | సౌదీలో మక్కా నుండి మదీనా వెళ్తున్న బస్సు, డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 45 మంది హైదరాబాద్ వాసులు మరణించారు.

Saudi Arabia Bus Accident: మక్కా నుంచి మదీనాకు వెళుతున్న యాత్రికుల బస్సు ప్రమాదంలో 45 మంది మరణించారు. 18 మంది మహిళలు, 18 మంది పురుషులు, పదిమంది చిన్నారులు ఈ ఘటనలో చనిపోయారు. బస్సులో ఉన్న వారందరూ హైదరాబాద్‌కు చెందినవారని జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. సిటీ నుంచి 54 మంది మక్కా యాత్రకు వెళ్లగా.. అందులో 46 మంది బస్సులో మక్కా నుంచి మదీనాకు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో తీవ్ర విషాదం నెలకొంది. బస్సులో మంటలు చెలరేగి క్షణాల్లో మొత్తం వ్యాపించడంతో ఒక్కరు మినహా 45 మంది సజీవ దహనం అయ్యారు. అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి గాయాలతో బయటపడ్డాడని అధికారులు తెలిపారు. మృతులు హైదరాబాద్ లోని మల్లెపల్లి, బజార్ ఘాట్, ఆసిఫ్ నగర్ కు చెందిన వారని తెలుస్తోంది.
సోమవారం (నవంబర్ 17, 2025) తెల్లవారుజామున దాదాపు 1.30 గంటలకు హైదరాబాద్ యాత్రికులు వెళ్తున్న బస్సు, డీజిల్ ట్యాంకర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన వారని ఆలస్యంగా తెలిసింది. మక్కా నుంచి మదీనాకు తిరుగు ప్రయాణంలో ముఫ్రీహాట్ అనే ప్రదేశంలో విషాదం చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు, పురుషులు ఉన్నారు. బస్సులో 45 మంది ప్రయాణించిన లిస్ట్ బయటకు వచ్చింది. మహమ్మద్ అబ్దుల్ షోయబ్ ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
బస్సు ప్రమాదంలో మృతులలో కొందరి వివరాలు..
సౌదీలో బస్సు ప్రమాదం మృతుల్లో రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, మహ్మద్ మంజూర్, మహ్మద్ అలీతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు.

ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రపోతున్నారు. ట్యాంకర్ నుంచి డీజిల్ లీక్ కావడం ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు మంటల్లో కాలి బూడిదైంది. ఉమ్రా యాత్ర పూర్తి చేసిన తరువాత, వారంతా జియారత్ కోసం వెళ్లడానికి మదీనా వైపు వెళుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలో 8 మంది చనిపోగా, మరో కుటుంబంలో 7 మంది మృతిచెందారని సమాచారం.
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ యాత్రికులు సజీవ దహనం అయ్యారు. మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తున్న సమయంలో డీజిల్ ట్యాంకర్, యాత్రికుల బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 45 మంది చనిపోయారు. మొత్తం మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ యాత్రికులు కొందరు ఉన్నట్టు తెలియడంతో సౌదీలో బస్సు ప్రమాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. బస్సు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, తెలంగాణ నుంచి ఎంత మంది వ్యక్తులు ఉన్నారో నిర్ధారించడానికి చర్యలు చేపట్టారు.
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నంబర్లు..
వందన, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్- +91 98719 99044
సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- +91 99583 22143.
రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్- +91 96437 23157.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
సౌదీలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారిని గుర్తించాలని, గాయపడిన వారికి అన్ని విధాలా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, సౌదీ రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి తెలంగాణ సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాదానికి సంబంధించి బాధితుల కుటుంబాలకు సమాచారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు హెల్ప్‌లైన్ నంబర్‌లను విడుదల చేసింది, తద్వారా కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం అందుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
In view of a tragic bus accident near Madina, Saudi Arabia, involving Indian Umrah pilgirms, a 24x7 Control Room has been set up in Consulate General of India, Jeddah.
— India in Jeddah (@CGIJeddah) November 17, 2025
The contact details of the Helpline are as under:
Toll free number-
8002440003@MEAIndia @IndianDiplomacy…






















