Talasani On LPG Price Hike: బీజేపీ నేతలకు కర్ర కాల్చి వాత పెట్టండి - వంట గ్యాస్ ధరల పెంపు నిరసనలో మంత్రి తలసాని
Talasani Srinivas Yadav: తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని, 2024 లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పతనం ఖాయం అన్నారు.
సికింద్రాబాద్.. ఓట్లు వేయాలంటూ బీజేపీ నేతలు వచ్చి అడిగితే కర్ర కాల్చి వాత పెట్టాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వంట గ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నదని ఆరోపించారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నా, ఆందోళన లో మంత్రి తలసాని పాల్గొన్నారు. ధరలను అదుపు చేయడంలో విఫలమైన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
కుబేరులు అంబానీ, ఆదానీలకు దోచి పెట్టేందుకే కేంద్రం గ్యాస్ ధరలు పెంచిందని మంత్రి తలసాని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని, 2024 లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పతనం ఖాయం అన్నారు. కంటోన్మెంట్ లోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆర్మీ హాస్పిటల్ లో అనుమతించలేదన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేశామన్నారు. కంటోన్మెంట్ లో గతంలో 15 రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా జరిగేది... నేడు ప్రతినిత్యం సరఫరా జరుగుతుందన్నారు.
అందుకే బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పార్టీ..
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్పు జరిగిందన్నారు మంత్రి తలసాని. పేదలు వాడే వంట గ్యాస్ రేట్లు పెంచి, ధనవంతులు విమానంలో తిరిగే రేట్లను తగ్గించిన మోదీకి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం నిత్యం ప్రజల కోసం పనిచేస్తుంటే, బిజెపి ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కొద్ది రోజులలో కంటోన్మెంట్ బోర్డ్ ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ వాళ్లు వచ్చి ఓటు అడుగుతే కర్ర కాల్చి వాత పెట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం వంట గ్యాస్ రేటును పెంచుతున్నారు. రాబోయే రోజులలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని మంత్రి తలసాని అన్నారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతుర్లు లాస్య నందిత, నివేదిత, ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జల నాగేష్ పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఎల్పీజీ ధరల పెంపుపై నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ BRS పార్టీ పిలుపులో భాగంగా పెంచిన గ్యాస్ ధరలపై గ్యాస్ బుడ్డీలతో నిరసన తెలుపుతూ.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని NTR చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. కార్పొరేట్లకు వత్తాసు పలుకుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, నిత్యావసర సరుకులతో పాటు గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కాలం చెల్లిందని, కేంద్ర ప్రభుత్వాన్ని కాలగర్భంలో కలిపితే తప్ప ప్రజలకు మంచి సదుపాయాలు అందుబాటులోకి రావని, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకొని, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.