Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం, ఇకపై ఈ సిరీస్ ఆటోలకు సిటీలో నో ఎంట్రీ
Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఇతర జిల్లా ఆటోలకు హైదరాబాద్ లో తిరగడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆటో సంఘాలు, ఓలా, ఉబర్ సంస్థలకు సూచనలు జారీ చేశారు

Hyderabad: హైదరాబాద్ లో రోజు రోజుకీ ట్రాఫిక్(Traffic) పెరుగుతోంది. ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వం వివిధ చర్యలు చేపడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఫ్లైఓవర్లను నిర్మిస్తుంది. వాహనాల రద్దీతో పాటు నగరంలో కాలుష్యం కూడా పెరుగుతోంది. ట్రాఫిక్ తో పాటు కాలుష్య నియంత్రణకు హైదరాబాద్(Hyderabad) పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నగరంలో తిరుగుతున్న ఆటోలను సీజ్ చేస్తున్నారు. దీంతో పాటు ఇతర జిల్లాల రిజిస్ట్రేషన్లు కలిగిన ఆటోలకు ఇకపై హైదరాబాద్ లో ప్రవేశం లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇతర జిల్లాల్లో రిజిస్టర్ అయిన ఆటోలకు(Autos) హైదరాబాద్ నగరంలో ప్రవేశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం హైదరాబాద్‌లో రిజిస్టర్ అయిన ఆటోలకు మాత్రమే నగరంలో నడిపేందుకు అనుమతి ఉన్నట్లు చెప్పారు. ఇతర జిల్లాల ఆటోలు నగరంలో కనిపిస్తే సీజ్ చేస్తామని పోలీసులు(Police) హెచ్చరించారు. ఇప్పటికే ఆటో సంఘాలు, ఓలా, ఉబర్ సంస్థలకు సూచనలు జారీ చేశారు. హైదరాబాద్ లో ఆటోలు భారీగా పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వివరించారు.
ఓలా, ఉబర్ ఆటోల(Autos)కు కూడా నిబంధనలు వర్తింపు
హైదరాబాద్ నగరంలో 1.50 లక్షల ఆటోలు రిజిస్టర్ అయితే తిరుగుతున్నవి మాత్రం దాదాపు మూడు లక్షలు ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. నగరంలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్(Traffic Police commissioner) ఏవీ రంగనాథ్ తెలిపారు. కేవలం హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలని మాత్రమే ఓలా(ola), ఉబర్(Uber)ల తరపున నగరంలో తిరగడానికి అనుమతి ఇస్తామని వెల్లడించారు. బయటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు ఇకపై నగరంలో తిరగడానికి అనుమతి లేదన్నారు. ఆటో కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచి అమలుచేస్తామని, నగరంలో తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తామని ప్రకటించారు.
టీఎస్(TS) 09 నుంచి టీఎస్ 13 వరకు అనుమతి
రవాణాశాఖలో టీఎస్ 09 నుంచి టీఎస్ 13 వరకు గ్రేటర్ పరిధిలో నమోదైన ఆటోలను మాత్రమే హైదరాబాద్ లో నడపాలని పోలీసులు సూచించారు. ఈ సిరీస్ ఆటోలు మినహా మిగతా సిరీస్ ఆటోలకు హైదరాబాద్ లో అనుమతిలేదన్నారు. ఇతర జిల్లాల ఆటోలు తిరిగితే జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. దీనిపై మరొక వాదన కూడా వినిపిస్తుంది. అత్యవసర సమయాల్లో ఇతర జిల్లాల ఆటోలు నగర పరిధిలోకి రావడానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో ఆటోలను షరతుల మేరకు అనుమతిస్తారు. సమగ్ర అధ్యయనం చేసి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. రాత్రి పూట రోడ్లపై అతి వేగంగా తిరిగే బైక్‌లు, కార్ల(Cars) వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. త్వరలోనే ఇలాంటి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

