హైదరాబాద్ జలమండలికి ప్రతిష్టాత్మక పురస్కారం, ఆసియాలోనే అతిపెద్ద ప్లాంటు ఇక్కడే
Hyderabad Sewage Treatment: ప్రఖ్యాత మేగజైన్ వాటర్ డైజెస్ట్ 65 కేటగిరీల్లో అవార్డులు ఇచ్చింది. ప్రభుత్వ విభాగంలో 2022-23కిగానూ జలమండలి ఉత్తమ ఎస్టీపీ అవార్డ్ పొందింది.
Hyderabad Sewage Treatment: హైదరాబాద్ జలమండలికి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ప్రఖ్యాత మేగజైన్ వాటర్ డైజెస్ట్ 65 కేటగిరీల్లో అవార్డులు ఇచ్చింది. ప్రభుత్వ విభాగంలో 2022 - 23కి గానూ జలమండలి ఉత్తమ ఎస్టీపీ అవార్డ్ పొందింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు ఈ పురస్కారం అందుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జలమండలి చేసిన కృషిని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ శెకావత్ ప్రశంసించారు. హైదరాబాద్ లో వెలువడే మురుగునీటిని వందశాతం శుద్ధిచేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. నగరంలో అందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించడంతో పాటు, ఉత్పన్నమయ్యే మురుగును శుద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు జలమండలి ఎండీ దానకిశోర్.
జలమండలి కషిని కొనియాడిన కేంద్ర మంత్రి
దేశంలోనే వందశాతం మురుగు నీటిని శుద్ధి చేస్తున్న నగరంగా హైదరాబాద్ పనిచేస్తోందని కేంద్రమంత్రి గజేంద్రసిగ్ శెకావత్ ప్రశంసించారు. నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన గుర్తుచేశారు. నీటి వనరులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ గుర్తు చేశారు.
పెరిగిన హైదరాబాద్ నగర ప్రతిష్ఠ:
భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా వందశాతం మురుగు నీటి శుద్ధికోసం రూ.3866 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నగరంలో 62 ఎస్టీపీలను సీవరేజ్ మాస్టర్ ప్లాన్ కింద తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 1650 మిలియన్ లీటర్ల మురుగు నీరు రోజూ ఉత్పత్తి అవుతున్నది. ఇందులో 772 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని 25 ఎస్టీపీల ద్వారా శాస్త్రీయ పద్ధతిలో ప్యూరిఫై చేస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా మూసీలోకి వదులుతున్నారు. ఇంకా 878 ఎంఎల్డీల మురుగు జలాలు శుద్ధి చేయాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వం మొదటిదశలో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణాన్ని 2022లో చేపట్టింది. ప్రస్తుతం ఆయా ప్లాంటుల నిర్మాణ పనులు వేగంగా నడుస్తున్నాయి. కొద్దినెలల్లో వాటి పనులు పూర్తవుతాయి. తద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో ఉత్పన్నమయ్యే మురుగు నీటిని వందశాతం శుద్ధి చేయవచ్చు. ఫలితంగా దేశంలోనే హైదరాబాద్ వందకు వందశాతం మురుగు నీటిని శుద్ధి చేసిన నగరంగా నిలవబోతోంది.
ప్రసిద్ది చెందిన అంబర్ పేట్ ఎస్టీపీ:
మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో ఆసియాలోనే అతి పెద్ద ప్లాంటుగా అంబర్ పేట్ ఎస్టీపీ ప్రముఖమైంది. కూకట్ పల్లి నాలా నుంచి వచ్చే మురుగు నీరు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ఎన్నో నాలాలను కలుపుకుంటూ అంబర్ పేట్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ నిర్మించిన ప్లాంట్ ద్వారా నిత్యం 339 మిలియన్ గ్యాలన్ల డ్రయినేజ శుద్ధి అవుతుంది. అక్కడ శుద్ధయిన వాటర్ మూసీలోకి కలుస్తుంది.
శుద్ది చేసిన నీటిని ఇతర అవసరాలకు వినియోగం:
సర్క్యులర్ ఎకానమీ అనే పద్ధతి ద్వారా ఇక్కడ శుద్ధిచేసిన మురుగు పార్కుల్లో చెట్ల పెంపకానికి, ప్రభుత్వ రంగంలో నిర్మాణాలకు వాడుతుంటారు. పలు సాఫ్ట్ వేర్ కంపనీలు తమ కార్యాలయ ప్రాంగణాల్లో మొక్కల పెంపకానికి, మిగతా అవసరాలకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వాడుతున్నారు. నీటిలో మిగిలిపోయిన గట్టి పదార్థాలను బయోగ్యాస్ ఉత్పత్తికి వాడుతున్నారు.