Hyderabad Roads Empty: సంక్రాంతి ఎఫెక్ట్, రోడ్లన్నీ నిర్మానుష్యం - ట్రాఫిక్ కష్టాలు లేని హైదరాబాద్
Hyderabad Roads Empty: హైదరాబాద్ నగరం బోసిపోయింది. ఎటు చూసినా జనాలు లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సంక్రాంతి సందర్భంగా ప్రజలంతా సొంత గ్రామాలకు తరలి వెళ్లడంతో ఈ రహదారులు వెలవెలబోతున్నాయి.
Hyderabad Roads Empty: భాగ్యనగరం మొత్తం ఖాళీగా మారిపోయింది. రోడ్లన్నీ ప్రజలు లేక నిర్మానుష్యంగా మారాయి. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులంతా సొంతూళ్లకు తరలి వెళ్లారు. దీంతో నగరంలోని రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఎటు చూసినా రోడ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. నిన్న మొన్నటివరకు వాహనాలతో కిక్కిరిసిన రోడ్లు నేడు ఎవరూ లేక బోసిపోయాయి. వ్యక్తిగత వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో నగరవాసులు పండుగకు రెండు మూడ్రోజుల ముందు నుంచే సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డులపో పాటు రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, వరంగల్ హైవేలలోని టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. శనివారం భోగి కావడంతో గురు, శుక్ర వారాల్లో నగరవాసులు పెద్ద సంఖ్యలో తమ గ్రామాలకు వెళ్లిపోయారు.
జనవరి 12, 13వ తేదీల్లో రెండున్నర లక్షల పైగా వాహనాలు ఆయా హైవేలలోని టోల్ గేట్లను దాటాయని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేశారు. లక్షా 49 వేల 403 వాహనాలు విజయవాడ హైవేలోని పంతంగి, వరంగల్ హైవేలోని బీబీ నగర్ టోల్ ప్లాజాలను దాటి వెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో లక్షా 14 వేల 249 వాహనాలు కార్లే కావడం గమనార్హం. ఈ రెండు రోజుల్లో లక్షా 24 వేల 172 వాహనాలు విజయవాడ హైవేలోనే ప్రయాణించాయని పోలీసులు చెప్పారు. అలాగే వరంగల్ వైపు నుంచి హైదరాబాద్ కు 13 వేల 334 వాహనాలు వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట మధ్య నగరవాసులు ఎక్కువగా వాహనాల్లో ప్రయాణించారు.
విజయవాడ వైపుగా పంతంగి టోల్ గేట్ మీదుగా వెళ్లిన వాహనాల సంఖ్యను ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సంక్రాంతి పండుగ కోసం గత రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు 1.24 లక్షల వాహనాలు వెళ్లినట్లుగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. జనవరి 12 గురువారం 56,500 వాహనాలు వెళ్లాయని, 13న 67,500 కార్లు వెళ్లినట్లు వివరించారు. పండుగల కోసం వెళ్తున్న వారిలో 90 శాతం మంది సొంత వాహనాల ద్వారానే వెళ్లినట్లు తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం 98 వేలకు పైగా కార్లు హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ గేట్ మీదుగా విజయవాడ వెళ్లినట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బీబీ నగర్ టోల్ గేట్ మీదుగా నిన్న 26 వేల వాహనాలు వెళ్లాయని.. అందులో 18 వేల కార్లు ఉన్నాయని రాచకొండ పోలీసులు తెలిపారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు 13 వేలకు పైగా వాహనాలు వచ్చినట్లు స్పష్టం చేశారు.
పోలీసుల సూచనలు..
హైవేలో టోల్ గేట్ల వద్ద వాహనాలను క్రమ పద్ధతిలో పంపించేందుకు జీఎంఆర్ సిబ్బంది సాయం తీసుకున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, సొంత వాహనాలకు తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. టికెట్లు దొరకలేదని గూడ్స్ వాహనాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని సూచించారు. కమర్షియల్ డ్రైవర్లు సైతం కారు లేదా వాహనం కండీషన్‌ను పరిశీలించుకున్న తర్వాతే రోడ్డుపైకి రావాలని నిర్దేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.