Hyderabad Rains: వర్షాలను లైట్ తీసుకోవద్దు.. ఆ సమయంలో ఇళ్లు దాటి రావొద్దు, హైదరాబాద్ లో హైఅలెర్ట్ !
Rains In Telangana | తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. దాంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Rains In Hyderabad | వాతావరణశాఖ హెచ్చరించినట్లుగానే వరుణుడు తెలంగాణ వ్యాప్తంగా ఉగ్రరూపాన్ని చూపించాడు. హైదరాబాద్ నగరంలో నిన్నటి వరకూ పగటిపూట అంతలా కుండపోత వర్షం పడనప్పటికీ సాయంత్రం 4 దాటితే చాలు వాన దంచికొడుతోంది. గత రాత్రి నగరవ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైయ్యింది. వరుణుడు దెబ్బకు ఇళ్లు దాటి బయటకు రావాలంటే జనం హడిలిపోతున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్స్ నోళ్లు తెరుచుకుని మింగేస్తాయో అనే భయం భాగ్యనగరాన్ని భయపెడుతోంది.
నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. పూర్తి స్దాయి నీటిమట్టం దాటి భారీగా వరదనీరు చేరడంతో దిగువ ప్రాంతాలను అప్రమత్తం జీహెచ్ఎంసీ అధికారులు. హుస్సేస్ సాగర్ పూర్తి స్దాయి నీటిమట్టం 513.14 మీటర్లు కాగా, ప్రస్తుతం 513.40మీటర్లకు వరదనీరు చేరుకుంది. సాగర్ కు 1704 క్యూసెక్ ల నీరు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. సాగర్ కెపాసిటీ మించి వరద ఉప్పొంగడంతో వెయ్యి క్యూసెక్ నీటిని హుస్సేన్ సాగర్ తూముల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపధ్యంలో దోమలగూడ, అశోక్ నగర్ , గోల్నాక ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేశారు. ఇళ్లలోకి సాగర్ వరద చేరే అవకాశం ఉన్న కాలనీలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.
ప్రమాదకర స్థాయికి చేరిన హిమాయత్ సాగర్ నీటి మట్టం
నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, నాళాల నుండి చేరుతున్న వరదనీటితో హిమాయత్ సాగర్ లో వరద ప్రమాద స్దాయికి చేరింది. 28వేల క్యూసెక్ ల నీరు నీరు హిమాత్ సాగర్ లోకి చేరుతోంది. ఇన్ ఫ్లో పెరుగుతుండంతో 9వేల క్యూసెక్ ల నీటిని హిమాయత్ సాగర్ 10గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ మొత్తం నీటి నిల్వ సామర్ద్యం 2.97 టీఎంసీలు కాగా, ఇప్పటికే 2.70 టీఎంసీలకు వరద నీరు చేరింది. హిమాయత్ సాగర్ నుండి భారీగా నీరు దిగువకు వదలడంతో బండ్లగూడ జాగీర్ తో పాటు పలు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మలక్ పేట్ , రాజేంద్రనగర్ , గోషామహల్ లలో వరద ముంపు ప్రభావం ఉన్న కాలనీలలోని ప్రజలను జీహెచ్ఎంసీ విపత్తు బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మూసీకి పెరుగుతున్న వరద
హైదరాబాద్ నగరంలో ఓవైపు హుస్సేన్ సాగర్, మరోవైపు హిమాాయత్ సాగర్ లో వరద నీరు ప్రమాద స్దాయికి చేరుకోవడంతో తూములు,గేట్ల ద్వారా నీటిని మూసీనదిలోకి విడుదల చేస్తున్నారు.దీంతో మూసీలో వరద నీరు ఉప్పొంగుతోంది.మూసీని ఆనుకుని ఉన్న అనేక కాలనీలలో భారీగా మూసీ వరద నీరు చేరింది. ఇళ్లలోకి మోకాళ్లలోతు నీరు చేరడంతో , సామాన్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు మూసీ బాధితులు. మూసారాంబాగ్ బ్రిడ్జిపైకి ఎగసిపడుతూ వరదనీరు ఉప్పొంగుతోంది. యాకత్ పురా, చాధర్ ఘాట్ లలో వరద పరిస్దితిని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
మరో రెండు రోజులపాటు వర్షాలు దంచికొట్టే అవకాశం ఉండటంతో అటు జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా వర్షం ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించిన అధికారులు, పరిస్దితి చేయిదాటకముందే నాళాలను క్లియర్ చేయడం ద్వాారా వరదనీరు దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు.





















