Hyderabad Rains: సికింద్రాబాద్ అడ్డగుట్టలో వర్షానికి కూలిన ప్రహరీ గోడ - తృటిలో తప్పిన ప్రమాదం
Hyderabad Rains Latest news: గత మూడు, నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Compund wall collapsed in Secunderabad:
జీడిమెట్ల: గత మూడు, నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల రోడ్లు చెరువుల్లా కనిపిస్తే, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు రావడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ మునిసిపాలిటి పరిధిలో మల్లంపేటలోని కొత్తకుంట్ల నీట మునిగింది. పలు ఇళ్లల్లోకి వరద నీరు పోటెత్తింది. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. నీళ్ళలో చిక్కుకున్న కుటుంబాలను దుండిగల్ సి.ఐ రామకృష్ణ అండ్ టీమ్ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మేడ్చల్ జిల్లా దుండిగల్ మునిసిపల్ పరిధిలో మూడు రోజుల నుండి ఎకధాటిగా కురుస్తున్న వర్షానికి మల్లంపేట లోని కొత్తకుంట్ల జలమయమైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో వరద నీటితో ఇళ్లు నీట మునిగాయి. ఆ ప్రాంత వాసులకు ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ప్రజలు ఎవరైనా సహాయం కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
సికింద్రాబాద్ అడ్డగుట్టలో తృటిలో తప్పిన ప్రమాదం
సికింద్రాబాద్ అడ్డగుట్టలో ప్రమాదం తప్పింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగాప్రహరీ గోడ కూలిపోయింది. పక్కనే ఉన్న గుడిసెలపై పడడంతో అందులో ముగ్గురు చిన్నారులు చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు పిల్లలను రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా మూడురోజుల నుండి కొందరు పస్తులుంటున్నట్లు చెబుతున్నారు. 40ఏళ్లుగా ఈ గుడిసెల్లో నివాసం ఉంటూ కాగితాలు ఏరుకొని జీవిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఎన్నికలప్పుడు మాత్రమే వస్తున్న నేతలు తరువాత పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సహాయం లభిస్తుందని, సర్కార్ సొంతిల్లు కట్టించి ఇస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ముంపు ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టండి- భారీ వర్షాలు, వరదలపై సమీక్షలో కేసీఆర్
హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వరద నీటితో పలు ప్రాంతాలు జలాశయాల్లా మారిపోయాయి. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోందని మొదటి ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ వర్షాలతో వరద నీరు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వర్షాలపై శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సీఎస్శాంతి కుమారి, పలు శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వర్షాలు, నీటిపారుదల, ఆర్థిక, బీసీ శాఖలు, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు చేయాలని, ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చర్చించారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, వరద నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial