(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad: ఈ పగటి దొంగల తీరే వేరు, ఇల్లు ఇలా కనబడిందంటే అంతే సంగతి - పోలీసుల హెచ్చరికలు
మహారాష్ట్ర నుండి రైల్లో వచ్చి సికింద్రాబాద్‌లోని లాడ్జిల్లో గదిని అద్దెకు తీసుకొని వీరు నేరాలకు పాల్పడుతున్నారని డీసీపీ చందన దీప్తి తెలిపారు.
సికింద్రాబాద్‌లో కొత్తగా నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గురించి పోలీసులు హెచ్చరించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా చేసుకొని పగటి పూట మాత్రమే వీరు దోపిడీ చేస్తున్నారని ఉత్తర మండల డీసీపీ చందన దీప్తి వెల్లడించారు. ఈ ముఠా పుణెకు చెందినదని, వీరు పట్టుబడ్డారని ఆమె తెలిపారు. మహారాష్ట్ర నుండి రైల్లో వచ్చి సికింద్రాబాద్‌లోని లాడ్జిల్లో గదిని అద్దెకు తీసుకొని వీరు నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వారు మూడు రోజులపాటు రెక్కీ నిర్వహించిన అనంతరం పకడ్బందీగా చోరీ చేసినట్లు గుర్తించామని ఉత్తర మండల డీసీపీ చందన దీప్తి తెలిపారు.
నిందితుల నుండి ఆరు లక్షల విలువైన బంగారు ఆభరణాలు నగదు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చందన దీప్తి తెలిపారు. మహారాష్ట్రకు చెందిన నీలేశ్, ఆకాష్, విశాల్, శంకర్, దినేష్ లు పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చందన దీప్తి తెలిపారు. బోయిన్ పల్లికి చెందిన రమేష్ అనే సివిల్ కాంట్రాక్టర్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని రెండు రోజులపాటు బైక్ పై రెక్కీ నిర్వహించి చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డారు. అద్దె ఇళ్ల కోసం తిరుగుతున్నట్లు నమ్మిస్తూ దొంగతనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.. అనంతరం చిలకలగూడ మల్కాజిగిరి గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది.
సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ చందన దీప్తి తెలిపారు. ప్రజలంతా ఇళ్లలో సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవాలని అనుమానాస్పద వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చందన దీప్తి తెలిపారు.