Hyderabad News: ఎకరా భూమిలో అవకాడో పండిస్తున్న తెలంగాణ గిరిజన రైతు - ఒక్క పంటతోనే 4 లక్షల లాభం
Hyderabad News: తెలంగాణకు చెందిన ఓ గిరిజన రైతు అవకాడో పండించి అధిక లాభాలు పొందుతున్నారు. రూ.1.4 లక్షల ఖర్చుతో ఎకరం భూమిలో పంట సాగు చేయగా.. మొదటి కోతతోనే 4 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జించాడు.
Hyderabad News: మెక్సికో, మధ్య అమెరికా మూలాలు కలిగిన అన్యదేశపు పండు అవోకాడోను ఇప్పుడు తెలంగాణలో కూడా పండిస్తున్నాడో గిరిజన రైతు. మొదటిసారి పంట చేతికి రాగా.. దాన్ని కువైట్ కు ఎగుమతి చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బగూడకు చెందిన 30 ఏళ్ల జైపాల్ నాయక్.. తన సొంత భూమిలో అవకాడో సాగు చేస్తున్నాడు. 38 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో పెరిగే ఉష్ణమండల పండును పండిస్తున్నాడు. అయితే తెలంగాణలో తొలి అవకాడో పంటే కాకుండా... బంగ్లాదేశ్ నుంచి భారత దేశానికి దిగుమతి చేసుకున్న మొదటి ఆస్ట్రేలియన్ అవోకాడో రకం కూడా కావడం గమానర్హం.
అయితే లండన్ లో ఎంబీఏ చేసిన జైపాల్ నాయక్... కరోనా సమయంలో స్వదేశానికి వచ్చాడు. ఇంటి వద్దే ఉన్న ఆయన తన సొంత భూమిలో అవకాడో సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. మొక్కలు ఎక్కడ దొరుకుతాయని సెర్చ్ చేశాడు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ కు చెందిన జె కృష్ణారెడ్డి ఈ మొక్కలు దొరుకుతున్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే నర్సరీ కల్గి ఉన్న, ఈ పండ్ల రైతును కలిశాడు. తాను అవకాడో పండించాలని అనుకున్నట్లు చెప్పాడు. అందుకోసం మొక్కలు కావాలని అడగ్గా... కృష్ణారెడ్డి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అయితే తాను ఈ ఆస్ట్రేలియన్ అవకాడో రకాన్ని బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలిపాడు. ఇలా 200 మొక్కలు కొనుగోలు చేసిన జైపాల్ నాయక్.. తన సొంత భూమ ఎకరాలో వీటిని సాగు చేశాడు.
కొంతమంది రైతులు ఒకటీ, రెండు మొక్కలే తీసుకున్నారని జైపాల్ నాయక్ మాత్రం చాలా ధైర్యం చేసి చాలా మొక్కలను తీసుకున్నట్టు కృష్ణా రెడ్డి చెబుతున్నారు. 200 మొక్కల నాటిన జైపాల్ నాయక్ మూడేళ్లలోనే మొదటి పంటను అందుకున్నాడు. ఆయనకు వచ్చే లాభాలను చూసిన చాలా మంది రైతులు కృష్ణారెడ్డిని సంప్రదిస్తున్నారు.
ఎంతో ధైర్యంగా పంట సాగు చేసిన జైపాల్ రెడ్డి కల నెరవేరింది. కొన్ని రోజుల క్రితమే మొదటి పంట చేతికి వచ్చింది. దాదాపు 600 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అంతా ఆ పండు రూచి చూసేందుకు వచ్చారు. పండ్లను విపరీతంగా కొనుగోలు చేశారు. కేవలం మూడు రోజుల్లోనే పంట మొత్తం అమ్ముడు పోయింది. ఫలితంగా అతనికి 4 లక్షల రూపాయల లాభం వచ్చింది. అయితే తాను ఈ దిగుబడిని అస్సలే ఊహించలేదని.. సరైన సాగు పద్ధతులను అనుసరిస్తే ఈ పండును భారతేశంలో, తెలంగాణలో విస్తృతంగా పండివచ్చని జైపాల్ నాయక్ చెప్పారు. అలాగే ఒక్కసారి ఈ మొక్కలు నాటితే దాదాపు 30 ఏళ్ల పాటు ఏటా రెండు పంటలు పండుతాయని వివరించారు. ఓ ఎగుమతి సంస్థ కువైట్ కు పండ్లను ఎగుమతి జైపాల్ నాయక్ ను సంప్రదించారట. ఇప్పుడు చేతికి రాబోయే పంటను కువైట్ కు ఎగుమతి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వివరించారు.
తెలుగు మీడియంలో చదువుకున్న నాయక్... ఇంగ్లీష్ సరిగా రాకపోయినా లండన్ వెళ్లి ఎంబీఏలో చేరారు. ఇంగ్లీషు రాక అనేక సమస్యలు ఎదుర్కున్నారు. తిరిగి తెలంగాణకు వచ్చేసి చాలా ఉద్యోగాలు చేశారు. ఒకరి కింద పని చేయడం ఇష్టం లేక సొంతంగా ఏదైనా ప్రారంభించానుకున్నారు. ఈక్రమంలోనే అవకాడో సాగు చేయాలనే ఆలోచన వచ్చిందట. వెంటనే రీసర్చ్ చేసి ఎకరం భూమిలో అవకాడో సాగు చేశారు. పంట సాగుకు రూ.1.4 లక్షల ఖర్చు వచ్చింది. ఇప్పటి వరకు నాలుగు లక్షల రూపాయల లాభం వచ్చింది.
హైదరాబాద్‌లోని ఖరీదైన దుకాణాలు, సూపర్ మార్కెట్‌లలో కిలో అవకాడో పండ్లు 450 రూపాయల నుంచి 500 వరకు ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌కు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పండ్లు వస్తాయి. తెలంగాణలో డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం ప్రజాదరణ పొందినట్లే అవకాడో సాగు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజాదరణ పొందుతుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.