Rohit Sharma On Retirement: రిటైర్మెంట్‌పై స్పందించిన రోహిత్ శర్మ, సిడ్నీ టెస్టు నుంచి తప్పించడంపై ఏమన్నాడంటే
Ind vs Aus 5th Test : సిడ్నీ టెస్టు ఆడకపోవడంపై టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఫాం కారణంగా డ్రెస్సింగ్ రూముకు పరిమితం కావాలనుకున్నట్లు తెలిపాడు.
I Have Not Retired says Rohit Sharma | సిడ్నీలో జరుగుతున్న 5వ టెస్టులో రోహిత్ శర్మ ఆడటం లేదు. ఫామ్ లో లేకపోవడం, జట్టును సైతం ముందుండి నడిపించడం లేదని విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మను చివరి టెస్టు నుంచి తప్పిస్తారని, కోచ్ గంభీర్ సైతం అదే చేస్తాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో 5వ టెస్టు జట్టులో రోహిత్ లేడు. తొలి టెస్టులో విజయాన్ని అందించిన బుమ్రాకు పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. రెండో రోజు ఆట లంచ్ సమయంలో రోహిత్ శర్మ దీనిపై స్పందించాడు.
రోహిత్ శర్మను జట్టు నుంచి తప్పించారా ?
తాను బెంచ్‌కు పరిమితం కావాలని భావించానని.. తనను ఎవరూ జట్టు నుంచి తప్పించలేదని రోహిత్ శర్మ తెలిపాడు. తాను ఫామ్‌లో లేని కారణంగా జట్టు ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని, ఏ నిర్ణయం తీసుకోలేదన్నాడు. శుక్రవారం తొలి రోజు టాస్ తరువాత బుమ్రా సైతం ఇదే చెప్పాడు. జట్టు ప్రయోజనాల కోసం రోహిత్ రెస్ట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ తన కెప్టెన్ కు బుమ్రా మద్దతు తెలపగా.. తాజాగా జట్టు నుంచి తనను తప్పించడం ప్రచారంపై రోహిత్ స్పందించాడు.
ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టుకు అందుబాటులో లేని రోహిత్ శర్మ రెండో టెస్టుతో టెస్టులో చేరాడు. అయితే రెండో టెస్టులో ఓడిన భారత్, మూడో టెస్టు అతికష్టమ్మీద డ్రా చేసుకుని సంబరాలు చేసుకోవడం చూశాం. కీలకమైన నాలుగో టెస్టులో ఓటమితో జట్టు ప్రదర్శనపై, కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవానికి వన్డేల్లోనూ వరుస పరాజయాలు ఎదురయ్యారు. రోహిత్ సారథ్యంలోని భారత జట్టు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. అయితే టీ20 ప్రపంచ కప్ నెగ్గి వరల్డ్ కప్ కల నెరవేర్చుకున్నాడు రోహిత్. 17 ఏళ్ల తరువాత భారత్ టీ20 వరల్డ్ కప్ ముద్దాడింది.
Lunch on Day 2 in Sydney!
— BCCI (@BCCI) January 4, 2025
Four wickets in the morning session for #TeamIndia 🙌
Australia 101/5, trail by 84 runs
Scorecard - https://t.co/NFmndHLfxu#AUSvIND pic.twitter.com/ccce5vjdB9
లంచ్ సమయానికి 5 వికెట్లు కోల్పోయిన ఆసీస్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్టులో టీమిండియా పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. వారి బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు క్రీజులో నిలవలేక, పెవిలియన్ క్యూ కడుతున్నారు. రెండో రోజు లంచ్ సమయానికే ఆస్ట్రేలియా టాపార్డర్ ఓటైంది. లంచ్ బ్రేక్ సమయానికి ఆతిథ్య ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. ప్రస్తుతం వెబ్ స్టర్ 28 నాటౌట్, అలెక్స్ కేరీ 4 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ కృష్ణకు ఒక్క వికెట్ దక్కింది. ఆసీస్ జట్టు భారత్ కంటే ఇంకా 84 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ రెండు వికెట్లు సాధ్యమైనంత త్వరగా తీస్తే భారత్ ఆధిపత్యం చెలాయించే అవకాశం వస్తుంది.