Dharmapuri Srinivas Health: మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో చేర్చినట్లు ఎంపీ అరవింద్ వెల్లడి
Hyderabad News: మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన చిన్న కుమారుడు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.
Hyderabad News: మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆయన చిన్న కుమారుడు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో ఆస్పత్రికి చికిత్స కోసం సోమవారం తరలించినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం డి. శ్రీనివాస్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కొంతకాలం నుంచి డీఎస్ వయసురీత్యా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల డీఎస్ నిజామాబాద్ నగరంలోని ఆయన సొంత నివాసంలో మూడు రోజుల పాటు ఉన్నారు. నగరంలోని ఆయన అనుచరులతో వివిధ అంశాలపై చర్చించారు.
నిజామాబాద్ కు వచ్చినపుడు డీఎస్ ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుంచి ఆయన తరచూ అస్వస్థతకు గురవుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురి కావటంతో ఆస్పత్రికి తరలించారు. డీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అందువల్లే ఈరోజు, రేపు అంటే పిబ్రవరి 27, 28వ తేదీల్లో ఏర్పాటు చేసిన తన కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ధర్మపురి అర్వింద్ తెలిపారు.
మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
— Arvind Dharmapuri (@Arvindharmapuri) February 27, 2023
కాబట్టి ఈ రోజు, రేపు (27,28) రెండు రోజుల పాటు నా కార్యక్రమాలన్ని రద్దు చేసుకుంటున్నాను. pic.twitter.com/Z043QOGu9f