Hyderabad News: పండగతో పాటు దొంగలూ వస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త!
Hyderabad News: సంక్రాంతి పండుగ కోసం అందరూ సొంతూళ్లకు వెళ్తుంటారు. దీన్ని అదునుగా చేసుకున్న దొంగలు మాత్రం తాళం వేసి ఉన్న ఇళ్లను ల్క్షక్ష్యంగా చోరీలకు పాల్పడుతుంటారు. జాగ్రత్త సుమీ!
Hyderabad News: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే వేల మంది సొంతూళ్లు, గ్రామాలకు తరలి వెళ్తున్నారు. నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు నగరానికి చేరుకొని దోపిడీలకు తెగబడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తాజాగా జవహర్ నగర్ పరిధి దమ్మాయిగూడలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇబ్రహీం జవహర్ పట్నం, రాజేంద్రనగర్ ఠాణాల పరిధిలో 10కిపైగా దోపిడీలు జరిగాయి. దీంతో నగరంలోని మూడు కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు.
పాత నేరస్థులు, ఇటీవల జైలు నుంచి విడుదలైన వారిపై నిఘా పెంచాలని ఆదేశించారు. అనుమానితులను గుర్తించేందుకు రెండ్రోజులుగా నగరవ్యాప్తంగా నాకా బందీ నిర్వహించారు. రాత్రివేళ విజిబుల్ పోలీసింగ్ పెంచాలని క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టం చేశారు. హాట్ స్పాట్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో ప్రకంపనలు లేపిన "తార్" ముఠాను బాలానగర్ పోలీసులు గుర్తించారు. నిందితులను ఫింగర్ ప్రింట్ ఆధారంగా మహారాష్ట్ర ముఠాగా గుర్తించారు. ఖాకీ సినిమా మాదిరిగా పెద్ద పెద్ద ఆయుధాలతో చీకటి కమ్ముకున్నాక మనుషులకు గాయలు చేసి మరీ దోపిడీకి తెగబడే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొన్న నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ నిందితుడిని విచారించగా పాత నేరస్థుడిగా గుర్తించారు పోలీసులు.
ప్రకాశం జిల్లాకు చెందిన ముద్ద ఏసోబు(39) నగరంలో తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ గా చేసుకొని చోరీలకు పాల్పడేవాడు. చోరీ చేసిన నగలను అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. నిందితుడి పై ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్ లలో మొత్తం 38 కేసులు నమోదు అయ్యాయి. జైల్ కి వెళ్లి వచ్చిన నిందితుడిలో ఎటువంటి మార్పు లేదు. ఇలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు డీసీపీ శిల్పవల్లి తెలిపింది. అయితే సంక్రాంతి పండుగ సందర్బంగా ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ సిబ్బంది కూడా నిత్యం గస్తీ కాస్తోంది. బంగారు, వెండి ఆభరణాలు, డబ్బును బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. దొంగతనాలు ఎక్కువ జరిగే ప్రాంతాల వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కాలనీల్లో స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకొని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక ఠాణాకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలి.
ఇంటికి సెక్యూరిటీ అలారం, సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. ఇంటి ముందు చెత్త చెదారం, దినపత్రిక, పాల ప్యాకెట్లు జమ కానివ్వొద్దని తెలిపారు. ప్రధాన ద్వారానికి వేసిన తాళం కనిపించకుండా పరదాలు అడ్డుగా ఉంచాలని స్పష్టం చేశారు. ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసి ఉంచాలని, సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం ఇచ్చేలా స్థానికులను చైతన్య పరచాలని సిబ్బందిని ఆదేశించినట్లు వివరించారు. ప్రజలు ధైర్యంగా సొంతూళ్లకు వెళ్లి.. ఆనందంగా గడపొచ్చని అధికారులు తెలిపారు.