Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం- గణేష్ నవరాత్రుల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు ట్రైన్స్
హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ నవరాత్రుల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందించబోతోంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో అదనపు టికెట్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తోంది.
వినాయక చవితి వచ్చేస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నగరం సిద్ధమవుతోంది. మరో వారంలో వినాయక నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. ఎప్పటిలాగే... ఈ ఏడాది కూడా ఖైరతాబాద్‌లో గణనాధుడి భారీ విగ్రహం ప్రతిష్టించబోతున్నారు. ఈ ఉత్సవాలకు నగరవాసులే కాకుండా చుట్టుపక్క ప్రాంతాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు... హైదరాబాద్‌లో సందడి వాతావరణం కనిపిస్తోంది. గల్లీకో వినాయక మండపం కనిపిస్తుంది. డప్పుల మోత మారుమోగుతుంది. చిన్నాపెద్దా అంతా ఎంతో ఉత్సాహంగా... గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు.
హైదరాబాద్ గణేష్ చతుర్ధి వేడుకల్లో... ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ప్రత్యేకతే వేరు. భారీ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. నగరం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలపై కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు భక్తులు. పండుగ మొదటి రోజు నుంచే వేల మంది భక్తులు ఖైరతాబాద్ వస్తుంటారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అదనపు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల ప్రయాణం సులువుగా... సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపడతామని చెప్పింది. భక్తుల ప్రయాణానికి, భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. గణేష్ చతుర్ధికి అవాంతరాలు లేని ప్రయాణాన్ని కల్పించేలా మెట్రో రైలు సేవలు పెంచుతామని ప్రకటించింది. గణేష్ నవరాత్రుల సందర్భంగా మెట్రో రైళ్లను అర్ధరాత్రి ఒంటి గంట వరకు నడపాలని యోచిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. గతంలో మాదిరిగానే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకునే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇక, ఖైరతాబాద్ స్టేషన్‌లో అదనపు టికెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు టికెట్లు కొనేందుకు ఆలస్యం కాకుండా చర్యలు చేపడుతున్నారు. వీలైనంత త్వరగా టిక్కెట్లు తీసుకుని రైళ్లలో ఎక్కే అవకాశం కల్పిస్తున్నారు. భక్తుల భద్రతకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. ఖైరతాబాద్ స్టేషన్ దగ్గర మాత్రమే కాకుండా... ఇతర కీలకమైన మెట్రో స్టేషన్లలో దగ్గర కూడా అదనపు భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు.