Hyderabad Mayor: మహానగరంలో మట్టి వినాయకులు - ఉచితంగా 4.10 లక్షల విగ్రహాల పంపిణీ
Hyderabad Mayor: గణేష్ నవరాత్రిని కన్నులపండుగ్గా నిర్వహించేందుకు హైదరాబాద్ లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Hyderabad Mayor: హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటుతాయి. ముంబయి తర్వాత ఆ స్థాయిలో వినాయక చవితి వేడుకలు జరిగేది హైదరాబాద్ లోనే. గ్రేటర్ పరిధిలో వేలాది గణనాథులు కొలువుదీరుతాయి. ఈ వేడుకలను చూసేందుకు వివిధ జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలివస్తుంటారు. నిమజ్జనం రోజు వేడుకలు అంతకుమించి ఉంటాయి. ఈ ఏడాది కూడా గణేష్ నవరాత్రి వేడుకలు అట్టహాసంగా జరిగేందుకు గ్రేటర్ సమాయత్తం అవుతోంది. అన్ని శాఖల అధికారుల భాగస్వామ్యం, ఉత్సవ సమితుల సమన్వయంతో కన్నువ పండుగ్గా ఉత్సవాలు నిర్వహించేందుకు రాజధాని సన్నద్ధమవుతోంది.
పర్యావరణ హితమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలో 4.10 లక్షల మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ తెలిపారు. భక్తులకు సకల వసతతులు కల్పిస్తూనే, అత్యవసర సేవల్లో భాగంగా వైద్య శిబిరాలు, అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గణేశ్ నిమజ్జనం, శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా చెరువులు, రహదారుల వద్ద ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గణేష్ ఉత్సవాల వేళ హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు 10,500 మంది పారిశుద్ధ్య కార్మికులను మూడు షిఫ్టుల్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కోసం ఆయా శాఖల అధికారులతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్ బుధవారం రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Chaired review meeting at GHMC Head office on the smooth conduct of Ganesh festival and immersion programme. Along with the @CommissionrGHMC Ronald Rose Garu, Deputy Mayor @SrilathaMothe Garu, Medchal, Ranga Reddy, Collector's, Police officials, @GHMCOnline Officials, Ganesh… pic.twitter.com/wAb7z3gBTt
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) September 6, 2023
హెచ్ఎండీఏ పరిధిలో లక్ష, జీహెచ్ఎంసీ పరిధిలో 3 లక్షల మట్టి గణపతులను కార్పొరేటర్ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు మేయర్ వెల్లడించారు. అన్ని విభాగాల అధికారులతో పాటు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో మేయర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు సూచించిన అన్ని అంశాలనను పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తామని మేయర్ తెలిపారు. రోడ్లపై బారికేడ్లు, శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్లు, మొబైల్ ట్రీ కటింగ్, ఆరోగ్య శిబిరాలు, బోట్లు, స్విమ్మర్లు, నిరంతర విద్యుత్ సరఫరా, స్ట్రీట్ లైట్లు, పాట్ హాల్స్, తాగునీటి సరఫరా, అగ్నిమాపక యంత్రాలు తదితర ఏర్పాట్లు చేయనున్నట్లు మేయర్ వెల్లడించారు.
వినాయక చవితిని నగరవాసులు ఘనంగా జరుపుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీ వివిధ శాఖల సమన్వయంతో వ్యవహరించి, భక్తులకు పలు సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పుకొచ్చారు. మొదటి రోజు, చివరి రోజు గణనాథుల ఊరేగింపు సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినాయక చవితిని నగరవాసులు ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి సమస్యలు లేకుండా అట్టహాసంగా చేసుకునేలా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
నిమజ్జనం సందర్భంగా హెచ్ఎండీఏ ద్వారా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ లో 7 ప్లాట్‌ఫామ్‌లు, ట్యాంక్‌బండ్ వద్ద 14 ప్లాట్‌ఫామ్‌లు, పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లు, బుద్ధ భవన్ వైపు 7 ప్లాట్‌ఫామ్‌లు, హెలిప్యాడ్, సంజీవయ్య పార్కు వద్ద బేబీ పాండ్, అక్కడ కూడా క్రేన్లు ఏర్పాటు చేయనున్నారు. మ్యాన్ హోల్స్ మరమ్మతులు, తాగునీటి సరఫరా, అవసరమైన నీటి ప్యాకెట్లు, వాటర్ క్యాన్ల సరఫరా, ట్యాంకుల ద్వారా నీటి సరఫరా వంటి ప్రక్రియ జలమండలి చేపట్టనుంది. ప్రతిమల నిమజ్జనం కోసం నగరంలో 74 కొలనులను ఏర్పాటు చేయనుంది. 24 పోర్టబుల్ బేబీ పాండ్స్, 27 బేబీ పాండ్స్, 23 ఎక్సలేటర్లను ఏర్పాటు చేయనుంది.