Telangana Elections: తెలంగాణ ఎన్నికలు - బ్యాంకు మేనేజర్లకు ఈసీ కీలక ఆదేశాలు
Telangana Elections: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ గురువారం సమావేశం నిర్వహించారు.
Telangana Elections: తెలంగాణలో ఎన్నికల హోరు మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. పెద్ద ఎత్తున డబ్బు, బంగారం, వస్తువులు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూనే బ్యాంకుల్లో అనుమానిత లావాదేవీలపై దృష్టి సారించారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనుమానిత నగదు లావాదేవీలపై అధికారులు నిఘా తీవ్రం చేశారు. ఖాతాల్లో భారీగా నగదు జమ, విత్‌డ్రాల సమాచారాన్ని ఎన్నికల నోడల్ ఆఫీసర్ అకౌంటింగ్‌కు రోజు వారీ నివేదిక అందజేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సూచించారు.
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ గురువారం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, బ్యాంకుల్లో జరిగే డిజిటల్ లావాదేవీల్లో అనుమానిత, లెక్కకు మించిన నగదు ఖాతాలపై నిఘా ఉంచాలని బ్యాంకు మేనేజర్లకు ఆయన సూచించారు. అనుమానిత లావాదేవీల సమాచారాన్ని ప్రతి రోజూ ఉదయం 10 గంటల్లోపు పంపించాలని, ఎన్నికల అధికారులకు సహకరించాలని కోరారు.
అలాగే ఏటీఎంల్లో నగదు డిపాజిట్ చేయడానికి వినియోగించే వాహనాలపై నిఘా పెట్టాలని రొనాల్డ్ రాస్ బ్యాంకు అధికారులకు సూచించారు. ఏటీఎం నగదు వాహనాల మాటున డబ్బు తరలించే అవకాశం ఉందని, బ్యాంకులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఏటీఎంలో డబ్బు నింపే వాహనాలకు బ్యాంకులు తప్పనిసరిగా జీపీఎస్‌ను ఏర్పాటు చేసి ట్రాక్ చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, బ్యాంకు అధికారులు తరలిస్తున్న నగదుకు తప్పనిసరిగా డాక్యుమెంట్లు, క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి సంబంధీకుల అకౌంట్ల నగదు లావాదేవీలను అందించాలని రొనాల్డ్ రాస్ తెలిపారు. రాజకీయ పార్టీలకు సంబంధించి నేతలు, కుటుంబ సభ్యులు రూ.లక్షకు మించిన నగదు లావాదేవీలు జరిపితే సమాచారం అందించాలని తెలిపారు. నగరంలో అణువణువుగా తనిఖీలు జరుగుతున్నాయని, పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడుతోందని డిప్యూటీ డీఈవో అనుదీప్ తెలిపారు. పట్టుబడుతున్న నగదును పరిశీలించి ఎలాంటి సమస్య లేనప్పుడు వాటిని వేగవంతంగా రిలీజ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన రోనాల్డ్ రాస్
హైదరాబాద్‌లోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ గురువారం పరిశీలించారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ పోలీస్ కమిషనర్‌లతో పాటు కలిసి గురువారం ఉదయం పరిశీలించారు.
ఎల్బీ స్టేడియం, నిజాం కాలేజ్, ఏవీ కాలేజ్, కోఠి ఉమెన్స్ కాలేజ్, జేఎన్‌టీయూ, ఎగ్జిబిషన్ గ్రౌండ్, పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్, రెసెప్షన్ సెంటర్లలో ఏర్పాట్లను పరిశీలన చేసిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మౌలిక వసతులపై ఆరా తీశారు. కౌంటింగ్ కేంద్రాల్లో వీలైనంత తొందరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.