Hyderabad Crime News: రెండో పెళ్లి చేసుకున్న భార్యపై హత్యాయత్నం- చేతిలో ఉన్న పసిబాలుడు మృతి
Hyderabad Crime News: తనను వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో... మాజీ భార్యతోపాటు ఆమె రెండో భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దుర్ఘటనలో భార్య చేతిలో ఉన్న 8 నెలల బాబు మృతి చెందాడు.
Hyderabad Crime News: తనను ప్రేమించి పెళ్లి చేసుకొని ఓ పాప పుట్టాక వదిలి వెళ్లిపోయిందన్న కోపం... వేరొకరితో సంతోషంగా ఉందన్న ఈర్ష్య.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఓ పసికందు మృతి చెందగా... మరో ఇద్దరు చావుబతుకులు మధ్య కొట్టుమిట్టాడుతోంది.
ఓ వ్యక్తిని భార్య వదిలేసింది. ఆమె రెండో పెళ్లి చేసుకొని హాయిగా కలిసుంది. ఇదే కోపంతో వారి హత్యకు పథకం వేశాడతను. దంపతులిద్దర్నీ చంపాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే వారిద్దరిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఎనిమిది నెలల పసిబాబుతో ఉన్న టైంలో ఈ ఘటన జరిగింది. ఈ ముగ్గురికీ నిప్పంటుకుంది. దంపతులకు 50 శాతం గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. బాబు మాత్రం 90 శాతం గాయాలపాలై మృతి చెందాడు.
ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి..
హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన నాగుల సాయి, చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆర్తిని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగుల సాయి బ్యాండ్ కొట్టే పని చేస్తుండగా.. ఆర్తి నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో పూలు అమ్మతుండేది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఓ పాప పుట్టింది. ప్రస్తుతం ఆ పాప వయసు మూడేళ్లు. అయితే పాపు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి.
కొట్టుకొని తిట్టుకొని రోజూ ఉడటం కంటే విడిపోవడం మంచిదనుకొని భర్త నుంచి విడిపోయి పుట్టింటికి వెళ్లిపోయిందిఆర్తి. తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్, పాపతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే చిక్కడపల్లికి చెందిన ట్యాంక్ క్లీనర్ నాగరాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
రెండేళ్ల క్రితమే భార్యను చంపేందుకు పథకం..
ఆర్తి రెండో పెళ్లి చేసుకుందన్న విషయం తెలుసుకున్న మొదటి భర్త నాగుల సాయి... ఆమెపై పగ పెంచుకున్నాడు. తనను వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆర్తిని, ఆమె వివాహం చేసుకున్న నాగరాజు, తనకు అడ్డుపడుతున్న ఆర్తి సోదరుడు జితేందర్ ను చంపేయాలని నాగులసాయి రెండేళ్ల క్రితమే కుట్ర పన్నాడు. భార్యను చంపేందుకు వెళ్లగా జితేందర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో నాగుల సాయి జితేందర్ పై దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నాగుల సాయిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఏడాది క్రితం మరోసారి నారాయణగూడ పరిధిలో నాగుల సాయిపై కేసు నమోదు అయింది. దీంతో వారిపై కక్ష పెంచుకున్న నాగుల సాయి ఈసారి పక్కాగా హత్య చేసేందుకు పథకం వేశాడు.
తీవ్ర గాయాలపాలై బాబు మృతి..
ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి జగ్గులో పెట్రోల్ తీసుకొచ్చి ఆర్తి, ఆమె భర్త నాగరాజులపై చల్లి నిప్పంటించాడు. ఆ సమయంలో ఆర్తి చేతుల్లో తమ కుమారుడు పది నెలల విష్ణు కూడా ఉన్నాడు. తల్లిదండ్రులతో పాటు బాలుడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు డయల్ 100 కు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారు.
స్థానికుల సాయంతో బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం గాయాలు అయిన బాలుడు విష్ణు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దంపతులు ఆర్తి, నాగరాజు 50 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆధారాలు సేకరించిన పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడిని చంపి.. దంపతులపై హత్యాయత్నానికి పాల్పడ్డ నాగుల సాయి కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నగరమంతా జల్లెడ పడుతున్నారు.