Hyderabad Crime News: గూగుల్ సెర్చ్ చేసి మరీ నైజీరియన్ వలలో చిక్కిన వైద్యురాలు - 12.45 లక్షలు స్వాహా
Hyderabad Crime News: ప్రేమ సమస్యను తీర్చుకునేందుకు ఓ మహిళా వైద్యురాలు మాంత్రికుడి కోసం గూగుల్ లో వెతికింది. కానీ నైజీరియన్ల వలకు చిక్క 12.45 లక్షల రూపాయలు కోల్పోయింది.
Hyderabad Crime News: ప్రేమ సమస్య నుంచి బయటపడేందుకు ఓ మహిళా వైద్యురాలు మాంత్రికుడి సాయం తీసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే గూగుల్ లో స్వామీజీ కోసం వెతికింది. కానీ దురదృష్టవశాత్తు నైజీరియన్ల వలకు చిక్కింది. దాదాపు 12.45 లక్షల రూపాయలు మోసపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా.. ఇద్దరు నిందితులు చిక్కారు. మరో ఇద్దరు తప్పించుకొని పారిపోయారు.
అసలేం జరిగిందంటే..?
నైజీరియాకు చెందిన 41 ఏళ్ల ఒక్వుచుక్వు, 35 ఏళ్ల జోనాథన్, మైఖేల్ అజుండా, డేనియల్, వస్త్రాల వ్యాపార నిమిత్తం కొన్నేళ్ల క్రితం భారత్ కు వచ్చి నష్టపోయారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు దిల్లీ కేంద్రంగా మోసాలు చేయడం ప్రారంభించారు. ఏ సమస్యకు అయినా పరిష్కారం చూపిస్తామంటూ ఇంటర్ నెట్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఫోన్ నంబర్లు ఉంచారు. సంప్రదించిన వారిని మాయ మాటలతో నమ్మించి డబ్బు లాగుతున్నారు. కుషాయిగూడకు చెందిన కంటి వైద్యురాలు తన ప్రేమ వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యలు, వృత్తిపరంగా విజయం సాధించేందుకు సలహాలు, పరిష్కారం కోసం గూగుల్ లో వెతికారు.
అక్కడే ఆమెకు ఓ ఫోన్ నెంబర్ కనిపించింది. దీంతో వెంటనే ఆ మహిళా వైద్యురాలు ఆ నంబర్ కు ఫోన్ చేసింది. అయితే ఉగండాకు చెందిన వ్యక్తితో ప్రార్థనలు చేయించి సమస్య పరిష్కరిస్తామంటూ మభ్యపెట్టారు. రూ.12.45 లక్షలు వసూలు చేశారు. మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా... ఒక్వుచుక్వు, ఉజకలను దిల్లీలో అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పారిపోయారు.
ఇటీవలే డ్రగ్స్ సప్లై చేస్తూ దొరికిపోయిన నైజీరియన్లు..
హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారు 18 లక్షల విలువైన డ్రగ్స్ ,178 గ్రాముల కొకైన్ హాయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన గాడ్విన్ ఇంపీయాగ్ ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బెంగుళూరు నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకువస్తున్నట్లు హయత్ నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. గతంలో దుల్ పేట్ డ్రగ్స్ కేసులో గాడ్విన్ అరెస్ట్ అయ్యాడని అన్నారు. నిందితుడు నకిలీ పాస్ పోర్ట్ తో ట్రావెల్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. 3 నెలలో 400 సిమ్ కార్డులు ఉపయోగించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. 2015 లో చదువు నిమిత్తం హైదరాబాద్ వచ్చిన గాడ్విన్ ఇంపీయాగ్ ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలం ఉన్నాడని అన్నారు. వీసా గడువు ముగిసినా ఇల్లీగల్ గా దేశంలో ఉంటున్నాడని తెలిపారు. నిందితుడు రెండు పాస్ పోర్ట్ లు కలిగి ఉన్నాడన్నారు. బెంగళూరుకు చెందిన అస్లాం నుంచి డ్రగ్స్ తెచ్చాడన్నారు. బోర్నవిటా డబ్బాలో డ్రగ్స్ ను హైదరాబాద్ తీసుకొచ్చాడని చెప్పారు.
"బెంగళూరు నుంచి బస్ లో హైదరాబాద్ కు డగ్స్ తీసుకొచ్చాడు. బెంగళూరు నుంచి 200 గ్రాములు తెచ్చాడని చెప్పుతున్నాడు. అందులో 178 గ్రాముల డ్రగ్స్ మాత్రమే దొరికింది. 28 గ్రాములు అమ్మేసినట్లు చెపుతున్నాడు. దూల్ పేట్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మూడు నెలల పాటు జైల్లో ఉన్నాడు. బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ ఈ దందా చేస్తున్నాడు."- ఎక్సైజ్ పోలీసులు