Hyderabad Crime News: ఆలయంలో చోరీ చేసేందుకు వచ్చి అనంత వాయువుల్లో కలిసిపోయాడు, అసలేం జరిగిందంటే?
Hyderabad Crime News: కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి గుడిలో చోరీ చేసేందుకు వచ్చిన యువకుడు గుడిలోనే ప్రాణాలు కోల్పోయాడు. అసలేం జరిగిందంటే..?
Hyderabad Crime News: ఆలయంలో చోరీ చేసేందుకు వచ్చాడు. హుండీ పగులగొట్టే పనిలో ప్రపంచాన్నే మరిచిపోయాడు. విషయం గుర్తించిన ఆలయ వాచ్ మెన్.. అక్కడకు వచ్చి దొంగను అడ్డుకోబోయాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. వాచ్ మెన్ సదరు వ్యక్తిని గట్టిగా తోసేయగా.. దొంగ తల గోడకు తగిలి తీవ్ర రక్తస్రావం అయింది. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 60 ఏళ్ల వయసు ఉన్న రంగయ్య అనే వ్యక్తి వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఓ యువకుడు గుడిలో చోరీ చేసేందుకు వచ్చాడు. నేరుగా హుండీ దగ్గరకు వెళ్లి దాన్ని పగులగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే విషయం గుర్తించిన వాచ్ మెన్ రంగయ్య అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయబోయాడు. వద్దని వారించినా అతడు వినకపోవడంతో అతడిని ఆలయం బయటకు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ పెనుగులాటలో రంగయ్య సదరు వ్యక్తిని తోసేయగా.. అతడు వెళ్లి గోడకు గుద్దుకున్నాడు. ఈ క్రమంలోనే అతడికి తీవ్ర గాయమై బొటబొటా రక్తం కారింది. వెంటనే కిందపడిపోయిన దొంగ.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం గమనించిన రంగయ్య వెంటనే పోలీసులకు, ఆలయ అధికారులకు సమాచారం అందించాడు.
హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే మృతుడి వద్ద ఓ ఫోన్ దొరికింది. ఆ ఆధారాలను బట్టి దొంగతనానికి వచ్చిన యువకుడు 23 ఏళ్ల వయసు కల్గిన గండం రాజుగా పోలీసులు గుర్తించారు. అయితే అతడు కామారెడ్డి జిల్లా ఆరేపల్లికి చెందిన వాడని చెప్పారు. వెంటనే రాజు చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాజన్న దర్శనానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన భక్తుడు
వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి వారి దర్శనార్థం గత నెలలో నిజాంసాగర్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి కుటుంబ సమేతంగా వచ్చాడు. అయితే వేములవాడకు చేరుకున్న తర్వాత అతనికి ఫిట్స్ వచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈవో కార్యాలయం ముందు పడిపోయి 30 నిమిషాల పాటు అలాగే ఉన్నాడు. వైద్యుల కోసం కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా లాభం లేకపోయింది ఈ క్రమంలోనే సాయిలు అక్కడే చనిపోయాడు. దీంతో చేసేదేం లేక మృతదేహాన్ని తీసుకొని కుటుంబ సభ్యులు తమ సొంత గ్రామానికి వెళ్లిపోయారు. వైద్యులు త్వరగా రాకపోవడం వల్ల సాయిలు చనిపోయినట్లు తెలుస్తోంది. అతనికి ఫిట్స్ వచ్చిన అరగంటకు కూడా వైద్యులు రాకపోవడంతో అతను మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.