Chikoti Praveen Kumar: నా క్యాసినోలన్నీ లీగలే! ఈడీకి సమాధానం చెప్పుకుంటా, మీకు కాదు: చికోటి ప్రవీణ్ వివరణ
Casino Chikoti Praveen Kumar: సాధారణ వ్యక్తి అయిన మిమ్మల్ని ఈడీ ఎందుకు టార్గెట్ చేసిందని విలేకరులు ప్రశ్నించగా, వాళ్లకి ఏవో డౌట్లు ఉండడం వల్లనే వచ్చారని అన్నారు.
Chikoti Praveen Kumar: ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు, నోటీసులు అంశంపై మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాసినో నిర్వహకుడు చికోటి ప్రవీణ్ కుమార్ స్పందించారు. సాధారణ సోదాల్లో భాగంగానే ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. వారికి ఏదో డౌట్ వచ్చి ఉంటుందని, అందుకే తనిఖీలు చేసుకుంటున్నారని అన్నారు. తనకు నోటీసులు కూడా ఇచ్చినందున విచారణకు హాజరై చెప్పుకుంటానని అన్నారు. తాను నిర్వహించిన క్యాసినోలు అన్నీ లీగలే అని చెప్పుకొచ్చారు. నేపాల్‌లో గోవాలో, దేశంలో తాను నిర్వహించిన క్యాసినోలు అన్నీ లీగల్ అని అన్నారు.
సాధారణ వ్యక్తి అయిన మిమ్మల్ని ఈడీ ఎందుకు టార్గెట్ చేసిందని విలేకరులు ప్రశ్నించగా, వాళ్లకి ఏవో డౌట్లు ఉండడం వల్లనే వచ్చారని అన్నారు. మనీలాండరింగ్ లాంటి ఆరోపణలు ఏం ఉన్నా తాను సమాధానం చెప్పుకుంటానని అన్నారు. ఏం చెప్పుకోవాలన్నా తాను ఈడీ అధికారులకే సమాధానం చెప్పుకుంటానని, మీకు చెప్పాల్సిన అవసరం లేదని మీడియాను ఉద్దేశించి అన్నారు. తన నుంచి అధికారులు ఏమీ సీజ్ చేయలేదని అన్నారు.
స్పందించిన మంత్రి మల్లారెడ్డి
Minister Malla Reddy Response: క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేసిన సోదాల్లో.. మాధవ రెడ్డి ఎమ్మెల్యే సిక్కర్ అంటించి కారు ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ మంత్రి సీహెచ్ మల్లారెడ్డికి చెందినదిగా ఈడీ అధికారులు గుర్తించారు. అయితే, ఈ అంశంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆ స్టిక్కర్ తనదేనని మంత్రి ఒప్పుకున్నారు. అయితే, 2022 మార్చి నాటి స్టిక్కర్ అని, మూడు నెలల క్రితం తీసి బయట పడేశానని చెప్పారు. అది తీసుకొని ఎవరో పెట్టుకుంటే తనకేంటి సంబంధం అని మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు.
ఎమ్మెల్యే మల్లారెడ్డి స్టిక్కర్ తో ఉన్న కారును మహేందర్ రెడ్డి అనే వ్యక్తి వాడుతున్నట్లుగా గుర్తించారు. అయితే, కారు నెంబరులో కూడా ఓ ట్విస్ట్ ఉండడాన్ని గుర్తించారు. కారు నెంబర్ TS10ET 0444 కాగా 0 లేకుండా కేవలం 444ను రాసుకుని తిరుగుతున్నారు. చీకోటి ప్రవీణ్ ఇంట్లో 14 గంటలకు పైగా ఈడీ సోదాలు కొనసాగాయి. చీకోటి ప్రవీణ్, సతీమణి, ఆయన కొడుకును కూడా దీనిపై విచారణ చేశారు.
విదేశాల్లో క్యాసినో
క్యాసినో వ్యవహారంలో బోయిన్‌పల్లి లో మాధవ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు బుధవారం రాత్రి ముగిశాయి. దాదాపు 16 గంటలపాటు క్యాసినో వ్యవహారంలో అన్ని కోణాలలో ఈడీ అధికారులు విచారణ చేశారు. దాసరి మాధవ రెడ్డి ఇంటి నుండి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నేపాల్, ఉత్తర ప్రదేశ్, థాయిలాండ్, ఇండోనేషియా ప్రాంతాలలో క్యాసినో నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. హైదరాబాద్ గుంటూరు విజయవాడకు చెందిన వ్యక్తులను క్యాసినో ఆడేందుకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించడం, క్యాసినో నిర్వహణ వ్యవహారంలో కీలక ఏజెంట్లుగా దాసరి మాధవరెడ్డి, చీకోటి ప్రవీణ్ వ్యవహరించారని చెప్పారు.