Hyderabad Students Protest: ఇంజినీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన, కొందరు బిల్డింగ్ ఎక్కడంతో టెన్షన్ టెన్షన్
Students Protest At Sreenidhi university Campus: శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు బుధవారం ఆందోళనకు దిగారు.
Students Protest At Sreenidhi university Campus:
హైదరాబాద్: ఘట్‌కేసర్ మండలంలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు బుధవారం ఆందోళనకు దిగారు. కొందరు బిల్డింగ్ మీదకి ఎక్కి దూకేస్తామంటూ నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారేలా కనిపిస్తోంది. వాస్తవానికి వర్సిటీకి అనుమతి రాకముందే శ్రీనిధి యూనివర్సిటీగా మారిందని తప్పుడు సమాచారం ఇచ్చింది మేనేజ్ మెంట్. అనంతరం 290 మంది విద్యార్థులు చేరగా వారికి క్లాసులు నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పటికీ వర్సిటీ పర్మిషన్ రాకున్నా, క్లాసులు నిర్వహించడంతో తమ భవిష్యత్ ఏంటో అర్థంకాక విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి కాలేజీలో నిరసనకు దిగారు.
స్వయంగా కాలేజీ యాజమాన్యం ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో కొందరు విద్యార్థులు బిల్డింగ్ మీదకు ఎక్కడంతో వారిలో ఎవరైనా కిందకి దూకేస్తారేమో, లేక పొరపాటున ఎవరైనా కింద పడిపోతే పరిస్థితి ఏంటని కాలేజీ యాజమన్యం టెన్షన్ పడుతోంది. కాలేజీ వద్ద నిరసన ఉద్రిక్తతలకు దారితీస్తుందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. విద్యార్థులను బిల్డింగ్ మీద నుంచి కిందకి దిగి రావాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..
గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీలలో అధికారులు అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించారు. శ్రీనిధికి అయితే వర్సిటీ అనుమతి లేకున్నా విద్యార్థులను జాయిన్ చేసుకోవడం వివాదాలకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ రెండు వర్సిటీల్లోని స్టూడెంట్స్ ను మేనేజ్ మెంజ్ కు చెందిన ఇతర కాలేజీల్లో సీట్లు సర్దుబాటు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి సూచించింది. ప్రభుత్వ ఆదేశాలతో విద్యార్థులను తమ ఇతర కాలేజీల్లో అడ్మిషన్ ఇవ్వడం లేదా సీట్ల బదలాయింపునకు ఆగస్టు 15 డెడ్ లైన్ అడిగింది శ్రీనిధి మేనేజ్ మెంట్. ఇచ్చిన గడువు ముగిసినా యాజమాన్యం నడుపుతున్న ఇతర కాలేజీల్లోకి తమను ట్రాన్స్ ఫర్ చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
శ్రీనిధి యూనివర్సిటీలోని 291 విద్యార్థులను అదే యాజమాన్యానికి చెందిన శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీలో సర్దుబాటు చేయాలి. ఈ అకడమిక్ ఇయర్ లో అంతమేర మేనేజ్‌మెంట్ కోటా సీట్లను తగ్గించుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. గురునానక్ వర్సిటీలో 1,255 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీలో సర్దుబాటు చేయడంతో పాటు గత ఏడాది భర్తీకాని సీట్లల్లో వర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులను చేర్చుకోవాలి. ప్రస్తుతం ఇబ్బందులకు గురవుతున్న ఈ విద్యార్థుల సంఖ్య ఎంత ఉందో అంతమేర సీట్లను ఈ ఏడాది, వచ్చే విద్యా సంవత్సరాలలో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కాలేజీ మేనేజ్ మెంట్ తగ్గించుకోవాలని సూచించారు.
ఒక్క గురునానక్ వర్సిటీలోనే మరో 47 మంది MBA విద్యార్థులను అదే కాలేజీలో సర్దుబాటు చేయాలని అధికారులు చెప్పారు. దాంతో 2023-24 విద్యా సంవత్సరంలో ఆ విద్యార్థులకు అనుగుగుణంగా ఎంబీఏ సీట్లు తగ్గుతాయి. 178 మంది ఎంసీఏ కోర్సు వారికి 178 జేఎన్టీయూ, ఓయూ పరిధిలోని కాలేజీల్లో సీట్లు కేటాయించాలని, 94 మంది బీసీఏ విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో సీట్లు సర్దుబాటు చేస్తారు.