Vanasthalipuram Theft: వనస్థలిపురం బ్యాంకు చోరీ కేసులో ట్విస్ట్! వెంటనే మరో మలుపు
ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బ్యాంకు నుంచి తాను డబ్బులు తీసుకెళ్ళలేదంటూ క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియో పంపాడు. అయితే బుధవారం డబ్బు తానే తీసుకెళ్లినట్లు ప్రవీణ్ ఒప్పుకున్నాడు.
హైదరాబాద్ వనస్థలిపురంలోని బ్యాంకులో డబ్బు దొంగతనం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. క్రికెట్ బెట్టింగే నిందితుడు డబ్బు కాజేసేందుకు కారణం అని తేలింది. బెట్టింగుల్లో బాగా డబ్బులు నష్టపోయి దొంగతనం చేశానని క్యాషియర్ ప్రవీణ్, బ్యాంకు మేనేజర్‌కి మెసేజ్ చేశారు. బెట్టింగ్‌లో తనకు డబ్బులు వచ్చేస్తే తిరిగి ఇస్తానని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బ్యాంకు ఉద్యోగులకు చెప్పినట్లుగా సమాచారం. అయితే, రెండు రోజుల కిత్రం బ్యాంకులో రూ.22.53 లక్షలతో క్యాషియర్ ప్రవీణ్ పారిపోయాడు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ కో ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు.
బ్యాంకు ఆఫ్ బరోడాలో ఈ క్యాషియర్ చేసిన పనికి ఉద్యోగులతో పాటు అంతా షాక్ అయ్యారు. వనస్థలిపురంలోని బ్యాంకు ఆఫ్ బరోడాలో 22.53 లక్షల నగదు మాయం అవ్వడంతో అధికారులు ఎవరు చేశారనే కోణంలో తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో క్యాషియర్ ప్రవీణ్ పై అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. క్యాషియర్ ప్రవీణ్ ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు నిర్దారించారు. మంగళవారం మధ్యాహ్నం రూ.22.53 లక్షలు డబ్బు తీసుకుని పారిపోయినట్లు పోలీసులు అధికారులకు తెలిపారు.
ప్రవీణ్ సెల్ఫీ వీడియో విడుదల
ఇదిలా ఉండగా, ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బ్యాంకు నుంచి తాను డబ్బులు తీసుకెళ్ళలేదంటూ క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియో పంపాడు. అయితే బుధవారం డబ్బు తానే తీసుకెళ్లినట్లు ప్రవీణ్ ఒప్పుకున్నాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నానని మెసేజ్ పెట్టగా, ఈ రోజు తాను డబ్బు తీయలేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
బ్యాంకులో నగదు లావాదేవీల్లో మైనస్‌గా వచ్చిన నగదును అందరూ తనపై పడేస్తున్నారని, బ్యాంకు మేనేజర్, సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయాడు. గతంలోనూ పలుమార్లు నగదు తక్కువగా ఉండటంపై మేనేజర్‌ను అడిగినా పట్టించుకోలేదని తెలిపాడు. బ్యాంకు మేనేజర్ వినయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతోందని, అనవసరంగా తనను తప్పుబడుతున్నారని ఆరోపించాడు. బ్యాంకులో సరైన నిఘా లేదని క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియోలో వివరించాడు.