Che Guevara: చే గువేరాను టీషర్టులకే పరిమితం చేయొద్దు - ఆయన కుమార్తె విజ్ఞప్తి
ప్రపంచ విప్లవ యోధుడు చే గువేరాకు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. రవీంధ్ర భారతిలో ఏర్పాటు చేసిన క్యూబా సంఘీభావ సభకు చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా హాజరయ్యారు.
క్యూబా విప్లవ వీరుడు అయిన చే గువేరాను ఆయన అభిమానులు కేవలం టీ షర్ట్‌లు, ఫొటోలకు మాత్రమే పరిమితం చేయొద్దని ఆయన కుమార్తె డాక్టర్ అలైదా గువేరా అన్నారు. చే గువేరా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తనను చేగువేరా కూతురిగా కాకుండా క్యూబా దేశానికి చెందిన ఓ మహిళగానే చూడాలని కోరారు. క్యూబా దేశంలోని అన్ని వనరులకు ప్రజలే ఓనరర్లు అని చెప్పారు. ప్రపంచంలో పలు దేశాల వనరులు దోచుకుంటున్న అమెరికా క్యూబా ధైర్యాన్ని చూసి భయపడుతోందని అన్నారు. క్యూబాను స్ఫూర్తిగా తీసుకుని ఇతర దేశాలు ఎదురు తిరుగుతాయనే ఆందోళన అమెరికాలో ఉందని చెప్పారు. అందుకే అమెరికా క్యూబాను ఆర్థిక దిగ్బంధం చేస్తోందని అన్నారు. చేగువేరా ఫొటోలపై చూపించే ఆసక్తి ఆయన ఆశయ సాధనలో చూపించాలని కోరారు చెప్పారు.
ప్రపంచ విప్లవ యోధుడు చే గువేరాకు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావం ప్రకటించింది. హైదరాబాద్ రవీంధ్ర భారతిలో ఏర్పాటు చేసిన క్యూబా సంఘీభావ సభకు చే గువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా హాజరయ్యారు. వారికి కమ్యూనిస్టు పార్టీల నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అలైదా గువేరా మాట్లాడుతూ.. ‘‘క్యూబా సోషలిస్టు దేశం. నేను తెల్లగా ఉన్నా నల్లవాళ్ల భావాలు నాలో ఉంటాయి. నా పట్ల మీరు చూపిన ఆదరణ చాలా బాగుంది. అవతలి వాళ్లకు అవసరం అయ్యే వ్యక్తులుగా మారినప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది. నేను క్యూబా సాధారణ మహిళను. నేను ప్రత్యేకం కాదు. మనం అందర్నీ సమానత్వంతో చూడాలి. చేగువేరా చేసిన విప్లవాన్ని మనం ఆచరించాలి. చేగువేరా బాటలో నడవాలి’’ అని మాట్లాడారు.
వైద్య సిబ్బందిలో 72 శాతం మంది మహిళలే ఉన్నారన్నారు. ఇండియాలా తాము మహిళను ప్రధానమంత్రిగా చూడలేకపోయామని, దానిపై తమ పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో భాగస్వామ్యమైతే దేశం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి మాట్లాడుతూ.. ఏ దేశం కూడా ఇంకో దేశంపై దాడి చేయడానికి వీల్లేదని అన్నారు. అమెరికా, రష్యా తదితర దేశాలు ఇతర దేశాలపై దాడి చేయడం వల్ల ఎన్నో చెడు ఫలితాలు ఎదురవుతున్నాయని అన్నారు. క్యూబా ఎంతోమంది డాక్టర్లను తయారుచేయడమే కాకుండా కరోనా కష్టకాలంలో పలు దేశాలకు పంపిందని గుర్తు చేశారు. క్యూబా మాదిరిగా విద్య, వైద్యాన్ని ప్రజలకు చేరవేయడంలో విఫలమయ్యామని అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగం పీఠికలో ఉన్న లౌకిక, సామ్యవాదం పదాలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆరోపించారు. ఆర్థిక అంతరాలు పెరుగుతున్న తరుణంలో సామాజిక స్పృహ, మార్క్సిస్టు ఆలోచనా విధానంతో ముందుకుపోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాటలు పాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.