Hyderabad Cricket Association: హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు విజయం, ఒక్క ఓటు తేడాతో HCAకు కొత్త బాస్
HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జగన్ మోహన్‌రావు గెలుపొందారు.
HCA President Jaganmohan Rao:
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్‌రావు గెలుపొందారు. సమీప ప్రత్యర్థి అమర్నాథ్‌పై కేవలం ఒక్క ఓటు తేడాతో జగన్ విజయం సాధించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎట్టకేలకు శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173 ఓట్లు ఉండగా 169 ఓట్లు పోలయ్యాయి.
బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన జగన్మోహన్ రావు.. క్రికెట్ ఫస్ట్ నుంచి పోటీలో ఉన్న అమరనాథ్ పై స్వల్ప తేడాతో విజయం సాధించారు. జగన్ కు 63 ఓట్లు రాగా, అమర్‌నాథ్‌కు 62 ఓట్లు వచ్చాయి. దాంతో ఒక్క ఓటు తేడాతో అమర్నాథ్ పై జగన్ మోహన్ రావు గెలుపొందారు. ఆనెస్ట్ హార్డ్ వర్కింగ్ హెచ్‌సీఏ ప్యానెల్ అభ్యర్థి పీఎల్ శ్రీనివాస్‌కు 34 ఓట్లు రాగా, గుడ్ గవర్నెన్స్ నుంచి బరిలో ఉన్న కె.అనిల్ కుమార్‌కు 10 ఓట్లు పోలయ్యాయని సమాచారం. ఫలితాలు ప్రకటించగానే జగన్మోహన్ మద్దతుదారులు స్టేడియం దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రావు ప్రస్తుతం హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీగా ఉన్నారు. ఆరుగురు సభ్యులతో కొత్త HCA ప్యానెల్ ఎన్నికైంది. ఆ ఆరుగురి సభ్యులలో పీఎల్ శ్రీనివాస్ ప్యానెల్ చోటు దక్కించుకోలేక పోయింది.
HCA కొత్త ప్యానెల్ ఇదే..
ప్రెసిడెంట్‌గా జగన్ మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ గా దళ్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), సెక్రెటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్), జాయింట్ సెక్రెటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), ట్రెజరర్ గా సీజే శ్రీనివాస్ రావు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్), కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) ఎన్నికయ్యారు.
ఉప్పల్ స్టేడియంలో రిటర్నింగ్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ సమక్షంలో, హెచ్‌సీఎ ఎన్నికలు జరిగాయి. సాయంత్రం నాలుగు గంటలవరకు ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 173 మంది ఓటర్లు ఉండగా.. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌లను ఎన్నుకోనున్నారు.