(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Floods: తెలంగాణలో వరద బాధితుల కోసం భారీ విరాళాలు, ఎవరు ఎంతిచ్చారంటే!
Telangana CMRF | తెలంగాణ, ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు ఖమ్మం జిల్లా, విజయవాడలో భారీ నష్టం వాటిల్లింది. ప్రముఖ వ్యాపారవేత్తలు, సంస్థల అధిపతులు తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించారు.
GMR Apollo hospitals and others huge donation to Telangana CMRF | హైదరాబాద్: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడానికి అన్ని కార్పొరేషన్లు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ పిలుపుతో రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund)కి రూ.2 కోట్ల విరాళం అందజేసింది. కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య మరికొందరు అధికారులు సచివాలయానికి వెళ్లి సీఎంను కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విరాళంగా అందించనున్న మొత్తానికిగానూ చెక్కును అందించారు. సీఎం రేవంత్ వారిని అభినందించారు. మిగతా కార్పొరేషన్లు కూడా ఇదే తరహాలో ప్రభుత్వం చేపట్టే సహాయ కార్యక్రమాలకు అండగా నిలవాలని రేవంత్ పిలుపునిచ్చారు.
జీఎంఆర్ గ్రూపు రూ.2.5 కోట్లు విరాళం
వరద బాధితులను ఆదుకోవడానికి పలు కంపెనీలు, సంస్థలు తమవంతు సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలను ప్రకటించాయి. జీఎంఆర్ గ్రూపు సంస్థ వరద బాధితులకు సహాయార్థం ఏకంగా రూ. 2.5 కోట్లను విరాళంగా అందజేసింది. విర్చో ల్యాబరేటరీస్ సంస్థ తరఫున కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును శుక్రవారం నాడు అందజేశారు. కెమిలాయిడ్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ చైర్మన్ కె.రంగరాజు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఆ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిలను కలిసి చెక్కును అందించారు.
శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున విరాళంగా రూ.1 కోటి చెక్కును అందించారు. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎండీ రాయల రఘు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కోటి రూపాయల విరాళం అందించారు. అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals) జేఎండీ సంగీతా రెడ్డి రూ.1 కోటి విరాళం ప్రకటించారు. ఆ మేరకు కోటి రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
Also Read: భారీ విరాళం ప్రకటించిన దగ్గుబాటి హీరోలు - మేము సైతం అంటూ ముందుకొచ్చిన వెంకటేష్, రానా