Ganesh Laddu Auction: వేలంలో రికార్డ్ ధర పలికిన మై హోమ్ భుజా గణేషుడి లడ్డూ, ధర ఎంతంటే
Hyderabad Ganesh Laddu Auction | వినాయక నిమజ్జనం వేడుకగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో మాదాపూర్ లోని మై హోం భుజాలో నిర్వహించిన వేలంలో గణేషుడి లడ్డూ రికార్డు పలికింది.
Ganesh Laddu Auction In Hyderabad | హైదరాబాద్: గణేష్ చతుర్థి 2024 ఉత్సవాలు చివరి దశకు వచ్చేశాయి. పలుచోట్ల ఇప్పటికే వినాయక నిమజ్జనం జరుగుతోంది. హైదరాబాద్ లో సెప్టెంబర్ 17న గణేష్ నిమజ్జనం కార్యక్రమం వేడుకగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మాదాపూర్ మై హోమ్ భుజాలో లడ్డూ అత్యంత ఖరీదైన లడ్డూగా నిలిచింది. మై హోమ్ భుజాలొ నేడు జరిగిన వేలంపాటలో హోరా హోరీగా లడ్డూ వేలం పాట జరిగింది. చివరకు గణేషుడి లడ్డూ రూ.29 లక్షల రికార్డు ధర పలికింది. ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్ వేలం పాటలో పాల్గొని లడ్డూను రికార్డు ధరకు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ చూస్తే హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ధర పలికిన లడ్డూగా మై హోమ్ భుజాలోని గణనాథుని లడ్డూ నిలిచింది.
2021లో ఇక్కడి లడ్డూ రూ.18.5 లక్షల ధర పలికింది. భక్తుడు విజయభాస్కర్ రెడ్డి ఆ ఏడాది లడ్డూను సొంతం చేసుకున్నారు. గత ఏడాది సైతం మైం హోం భూజా లడ్డూ రూ.25.5 లక్షల మేర ధరల పలకడం తెలిసిందే. గత ఏడాది హైదరాబాద్ లో ఫేమస్ అయిన బాలాపూర్ గణేషుడి లడ్డూ రూ.27 లక్షల ధర పలికింది. భక్తులు గణపయ్య లడ్డూలను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున వేలం పాటలో పాల్గొంటారు. గణేషుడికి సంబంధించిన జెండా, దండలు, లడ్డూ, స్వామి వారికి అలంకరించిన ఇతర వస్తువులను దక్కించుకునేందుకు భక్తులు ఎంతగానో ఆసక్తి చూపుతారు.
అత్యంత ఖరీదైన గణేష్ లడ్డూ ఇదే
తెలంగాణలో బాలాపూర్ లడ్డూ అంటే వేలం పాట గుర్తుకొస్తుంది. దశాబ్దాల నుంచి బాలాపూర్ గణేషుడి లడ్డూను సొంతం చేసుకునేందుకు విపరీతమైన పోటీ ఉంటుంది. కొన్నేళ్ల కిందటి వరకు గణేషుడి లడ్డూ రికార్డు ధర అంటే బాలాపూర్ గణపయ్య పేరు చెప్పేవారు. కానీ గత ఏడాది బండ్లగూడలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో ఏర్పాటు చేసిన గణేషుడి లడ్డూ చరిత్ర సృష్టించింది. 2023లో సెప్టెంబర్ 28న జరిగిన వేలంలో రిచ్‌మండ్ విల్లాలో ఏర్పాటు చేసిన గణేషుడి లడ్డూ రూ.1.26 కోట్ల ధర పలికింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యధిక ధర పలికిన లడ్డూగా నిలిచింది.
Also Read: ఈ ఏడాది గణేష్ నిమజ్జనం ఎప్పుడు? నిమజ్జనానికి మంచి మూహూర్తాలు ఇవీ