Hyderabad Crime: గచ్చిబౌలిలో హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారం భర్తను రప్పించి, ఆపై దారుణం
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అయినా కొందరిలో మార్పు రాకపోవడానికి బదులుగా పిల్లల ప్రాణాలు, జీవిత భాగస్వామి ప్రాణాలు తీసే వరకు వెళ్తున్న ఘటనలు జరుగుతున్నాయి.
రోజురోజుకూ మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో.. ముఖ్యంగా వివాహేతర సంబంధాలతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. అయినా కొందరిలో మార్పు రాకపోవడానికి బదులుగా పిల్లల ప్రాణాలు, జీవిత భాగస్వామి ప్రాణాలు తీసే వరకు వెళ్తున్న ఘటనలు సైతం చూస్తుంటాం. ఇటీవల గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన ఇలాంటి హత్య కేసు ఘటనను పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన వ్యక్తి భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 11న జరిగిన హత్య కేసును గచ్చిబౌలి పోలీసులు గురువాం ఛేదించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ధర్మారం తండాకు చెందిన ముడావత్ శేఖర్‌కు స్థానికంగా నివాసం ఉంటున్న జ్యోతితో దాదాపు పదేళ్ల కిందట వివాహమైంది. ఇంటి దగ్గర ఉపాధి దొరకకపోవడంతో ఈ భార్యాభర్తలు హైదరాబాద్‌కు వచ్చారు. మూడేళ్ల కిందట గచ్చిబౌలి సమీపంలోని గోపన్ తండాకు వలస వచ్చారు. భర్త శేఖర్ మేస్త్రీ పని చేస్తుండేవాడు. జ్యోతి కూలి పనులకు వెళ్లేది. ఇటీవల రాజీవ్ రెడ్డి అనే వ్యక్తి తెల్లాపూర్‌లో రెండు విల్లాలు కొనుగోలు చేశాడు. శేఖర్, జ్యోతి దంపతులు అక్కడ పనికి కుదిరారు.
Also Read: తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీకి వర్ష సూచన
రాజీవ్ రెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న మాణిక్యం అనే వ్యక్తి ఈ దంపతులకు పరిచయం అయ్యాడు. ఈ క్రమంతో మాణిక్యం, జ్యోతిల మధ్య వివాహేతర సబంధం ఏర్పడింది. కొన్ని రోజులు వీరు శేఖర్ లేని సమయంలో ఏకాంతంగా కలుస్తున్నారు. విషయం తెలుసుకున్న శేఖర్ ఇది తప్పు అని తన భార్య జ్యోతిని పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆవేశానికి లోనై పలుమార్లు జ్యోతిని కొట్టాడు. భర్త తనను కొడుతున్నాడని, తమ మధ్య వివాహేతర సంబంధం కొనసాగించడానికి వీలుకావడం లేదని ప్రియుడు మాణిక్యంకు చెప్పింది జ్యోతి. వీరిద్దరూ కలిసి శేఖర్ ను హత్యచేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్
ప్లాన్ ప్రకారం జ్యోతి చెప్పినట్లుగానే ఈ నెల 10న శేఖర్ ను మద్యం సేవించేందుకు మాణిక్యం ఫోన్ చేసి ఆహ్వానించాడు. పురుగుల మందు కలిపిన మద్యాన్ని శేఖర్ తో తాగించాడు. శేఖర్ అపస్మారకస్థితి వెళ్తున్న సమయంలో మాణిక్యం అతడిపై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు శేఖర్ ఫోన్ కాల్స్ వివరాలు సేకరించారు. చివరి కాల్ మాణిక్యం చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు విషయం చెప్పేశారు. జ్యోతి, తనకు మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఇందుకు అడ్డుగా ఉన్నాడని శేఖర్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: పండుగ నాడు భారీగా పెరిగిన ఇంధన ధరలు... ప్రధాన నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా