లోకేష్ పాదయాత్ర వేళ జేసీ దివాకర్‌రెడ్డి హాట్ కామెంట్స్- యువగళం గాలి తీసేలా వ్యాఖ్యలు!
ప్రస్తుతం పాదయాత్రలకు కాలం చెల్లిందన్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి, లోకేష్ ఎవరు పాదయాత్ర చేసినా పెద్దగా ప్రయోజనం ఉండబోదన్నారు.
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఇది పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది.
మరోసారి అధికారంలోకి రావడానికి తెలుగుదేశం తన శాయశక్తులా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కూడా మొదలు పెట్టారు. యువగళం పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో యువత ఓట్లు టార్గెట్‌గా యాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర 400 రోజుల పాటు కొనసాగునుంది.
లోకేష్ పాదయాత్రతో పార్టీకి పెద్ద ఎత్తున మైలేజీ వస్తుందని తెలుగుదేశం నేతలు నమ్ముతున్నారు. అయితే ఈ పరిస్థితిలో ఆ పార్టీ సినియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. లోకేష్ పాదయాత్రతో వచ్చే ఎన్నికల్లో తమకు భారీగా సీట్లు వస్తాయని టీడీపీ వర్గాలు భావిస్తుంటే... అసలు పాదయాత్రలో లాభం లేదని గాలి తీసేశారు.
తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు జేసీ దివాకర్ రెడ్డి. అక్కడ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. జేసీ దివాకర్‌రెడ్డి వచ్చిన సంగతి తెలిసి మీడియా ప్రతినిధులు ఆయన్ని చుట్టుముట్టారు. అయితే నేరుగా మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. కానీ మీడియాకు కావాల్సిన సరకు మాత్రం ఇచ్చారు. పాదయాత్రలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
ప్రస్తుతం పాదయాత్రలకు కాలం చెల్లిందన్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి, లోకేష్ ఎవరు పాదయాత్ర చేసినా పెద్దగా ప్రయోజనం ఉండబోదన్నారు. ఈ పాదయాత్రలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని కామెంట్ చేశారు.
ప్రస్తుత పాదయాత్రలను గతంలో జరిగిన పాదయాత్రలతో పోల్చిన జేసీ దివాకర్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. గతంలో జరిగిన పాదయాత్రలు వేరని ఇప్పుడు జరుగుతున్న పాదయాత్రలు వేరన్నారు. ఇప్పుడు జరుగుతున్న పాదయాత్రలు డబ్బుతో కూడుకున్నవని అభిప్రాయపడ్డారు.
జేసీ దివాకర్ రెడ్డి అంటే తెలియని వారుండరు. రాష్ట్ర విభజన ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈయన విభజన తర్వాత టీడీపీలోకి వచ్చారు. ఆయనతో పాటే ఆయన సోదురుడు జేసీ ప్రభాకర్, కుమారుడు పవన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఆయన ఏ పార్టీలో ఉన్న ప్రత్యేకంగా ఉంటూ... రాష్ట్ర రాజకీయాలపై ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే వారు. అందరిలాగా జాగ్రత్త పడుతూ.. మనసులోనే కొన్ని దాచేస్తూ ఉండే వ్యక్తి కాదు ఈయన. ఏం జరిగినా ఫర్వాలేదు అనుకొని కుండబద్ధలు కొట్టినట్లు విషయాన్ని చెప్తారు. మనుసులో ఎలాంటి విషయాన్ని కూడా దాచుకోరని చాలా మంది అభిప్రాయం. దీని వల్లే ఆయన చాలా సార్లు సమస్యలు ఇరుక్కున్నారు కూడా. అయినప్పటికీ ఆయన ఎక్కడా బెదరలేదు. వెనకడుగు వేయలేదు.
ఆయన సోదరుడు మాత్రం యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ మధ్య తాడిపత్రిలో జరిగిన సంఘటనపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. పోలీసులపై ముఖ్యంగా డీఎస్పీ చైతన్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఏజెంట్ గా చైతన్య వ్యవహరిస్తున్నారని ఇటీవల ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ ఇద్దరూ అక్రమ ఇసుక వ్యాపారంలో భాగస్వాములని ఆరోపించారు.