Kamareddy Monkeypox: ఫీవర్ ఆస్పత్రిలో కామారెడ్డి మంకీపాక్స్ కేసు, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏమన్నారంటే
‘‘అనుమానితుడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. అతని ఫ్యామిలీ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచాం. పేషెంట్‌లో నుంచి 5 రకాల శాంపిల్స్ తీసుకుని పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తున్నాం.’’ అని అన్నారు.
Kamareddy Monkeypox Case: తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు అనుమానించడం ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. కువైట్ లో ఉంటున్న 35 ఏళ్ల వ్యక్తి జులై మొదటి వారంలో కువైట్ నుంచి కామారెడ్డిలోని ఇందిరా నగర్‌కు చేరుకున్నాడు. అతనికి తీవ్రమైన అనారోగ్యం కలగడంతో పరీక్షలు చేయగా, మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో ఆ వైరస్ సోకి ఉంటుందని అనుమానించారు. అడిషనల్ టెస్టుల కోసం అతణ్ని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడి డాక్టర్లు ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు.
ఫీవర్ హాస్సిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘అనుమానితుడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. అతని ఫ్యామిలీ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచాం. పేషెంట్‌లో నుంచి ఐదు రకాల వేర్వేరు శాంపిల్స్ తీసుకుని పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తున్నాం. మంగళవారం సాయంత్రం లోగా రిపోర్ట్ వస్తుంది’’ అని సూపరింటెండెంట్ చెప్పారు. అయితే, మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తితో పాటు అతనితో దగ్గరగా మెలిగిన మరో ఆరుగురిని కూడా హోం ఐసోలేషన్ లో ఉంచామని ఆర్ఎంవో శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన బాధితుడు జ్వరంతో డాక్టర్లను సంప్రదించగా.. 23 న మంకీపాక్స్ గా అనుమానించారు. దీంతో హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో కామారెడ్డిలో ఆందోళన నెలకొంది.
ప్రపంచాన్ని కలవరం పెడుతోన్న మంకీపాక్స్ భారత్ లో విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటికే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. మంకీపాక్స్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఆదివారం దిల్లీలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయింది. ఇటీవల విజయవాడలో కూడా మంకీపాక్స్ కలకలం రేగింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. బాలిక శాంపిల్స్ ను పుణె వైరాలజీ ల్యాబ్ లో పరీక్షించగా నెగిటివ్ వచ్చింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
దేశంలో నాలుగు కేసులు
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపింది. వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
లక్షణాలు ఎలా ఉంటాయి?
మంకీపాక్స్ మశూచిని పోలి ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని పశ్చిమ దేశాల్లో, మధ్య దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రారంభ దశలో జలుబుగా ఎక్కువమంది భావిస్తారు. ఇది తీవ్రంగా మారినప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు పెరగిపోతాయి. ప్రారంభదశలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. చికెన్ పాక్స్‌ను మన దగ్గర అమ్మవారు అని పిలుచుకుంటారు. దాదాపు అందులో కనిపించే లక్షణాలే మంకీ పాక్స్ వైరస్ సోకినప్పుడు కూడా కనిపిస్తాయి. అరచేతులు, అరికాళ్లపై అధికంగా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సోకినా కూడా తీవ్ర జ్వరం ఉంటుంది. మంకీ పాక్స్ సోకినా తీవ్ర జ్వరం కనిపిస్తుంది.
- తలనొప్పి
- జ్వరం
- వెన్ను నొప్పి
- కండరాల నొప్పి
- చలి
- అలసట