Vatti Vasant Kumar Death: మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూత
వట్టి వసంత్ కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని పూండ్ల. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామం అయిన పూండ్లకు తరలించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. కొంత కాలం నుంచి అనారోగ్యంతో ఉన్న ఆయన విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వట్టి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని పూండ్ల. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామం అయిన పూండ్లకు తరలించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం.. ఆ తర్వాత రోశయ్య కేబినెట్‌లోనూ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి హాయాంలోనూ పర్యటక శాఖ మంత్రిగా వట్టి వసంత్ కుమార్ పని చేశారు.
టీడీపీ - కాంగ్రెస్ తెలంగాణలో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య ఒకసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో వసంత్ కుమార్ భేటీ కావడంతో ఆ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పవన్ కల్యాణ్‌తో తాను రాజకీయాలేమీ చర్చించలేదని, మర్యాద పూర్వకంగానే తాను కలిశానని అప్పట్లో చెప్పారు.