Hyderabad ED Searches: శ్రీలంక, నేపాల్‌లో క్యాసినోలు - హైదరాబాద్‌లో ఈడీ సోదాలు, ఒకేసారి 8 చోట్ల
Casino Organisers: ఇండో - నేపాల్ సరిహద్దుల్లో క్యాసినోలు నిర్వహిస్తున్నట్లు చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.
ED Searches in Hyderabad: హైదరాబాద్ నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏకకాలంలో 8 చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నాయి. క్యాసినోల ఏజెంట్లైన చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐఎస్ సదన్ లోని ప్రవీణ్ నివాసం, బోయిన్ పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఫెమా కింద ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో చికోటి ప్రవీణ్‌పై సీబీఐ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈడీ దాడులకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇండో - నేపాల్ సరిహద్దుల్లో క్యాసినోలు నిర్వహిస్తున్నట్లు చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ నుంచి పేకాట రాయుళ్లను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి స్పెషల్ విమానాల్లో పశ్చిమ బంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్ పోర్టుకు తరలించి, అక్కడి నుండి నేపాల్ లోని హోటల్ మెచి క్రౌన్ లో జూన్ 10 నుంచి 13 వరకు క్యాసినో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, డ్యాన్సర్లతో డ్యాన్సులు చేయించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ఒక్కో కస్టమర్ నుంచి రూ.లక్షలు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫెమా నిబంధనల కింద కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహిస్తోంది.
అంతకు ముందు వీరు శ్రీలంక కేంద్రంగా క్యాసినోలు నిర్వహించేవారు. అక్కడ సంక్షోభం ఏర్పడడంతో ఆ మాకం నేపాల్ కు మార్చినట్లుగా తెలుస్తోంది. నేపాల్ తో పాటు ఆ దేశ సరిహద్దు ప్రాంతాలు, యూపీ బార్డర్ లలో క్యాసినో నిర్వహించేవారు. అయితే, శ్రీలంకకు చెందిన క్యాసినో సంస్థలతో ప్రవీణ్, మాధవ రెడ్డి టీమ్ ఒప్పందాలు కుదుర్చుకొని వ్యవహారం నడిపించినట్లుగా తెలుస్తోంది. వారికి వచ్చిన డబ్బును హవాలా మార్గంలో శ్రీలంకకు తరలించినట్లుగా ఈడీ అధికారులు తేల్చారు. ప్రవీణ్, మాధవరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని అధికారులు చెబుతున్నారు.