Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Telangana News | తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు చేయనుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మదాపూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.
Telangana Minister Sridhar Babu | తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ (Blockchain City in Telangana)ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) వెల్లడించారు. అయితే ఎంత విస్తీర్ణంలో, ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నగరంలోని మాదాపూర్ లో శుక్రవారం నాడు డ్రోన్ టెక్నాలజీ (Drone Technology), రోబోటిక్స్ రంగంలో సుమారు 1800 మందికి ఉపాధి కల్పిస్తున్న ‘సెంటిలియన్ నెట్ వర్క్స్ అండ్ హెచ్ సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కొత్త క్యాంపస్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
దేశంలో నెంబర్ వన్‌గా నిలిచేలా ప్రణాళికలు
‘కొత్త సాంకేతికల ఆవిష్కరణలో తెలంగాణ(Telangana) రాష్ట్రాన్ని నంబర్ 1 గా నిలిచేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయా రంగాల్లో తెలంగాణ యువతకు స్కిల్స్ యూనివర్సిటీ (Skill University), పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇస్తాం. తద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఫ్యూచర్ సిటీలో నిర్మించ నున్న ఏఐ యూనివర్సిటీకి త్వరలో శంఖుస్థాపన చేయనున్నాం. ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను సైతం తెలంగాణలో ప్రారంభించబోతున్నాం’ అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్న శ్రీధర్ బాబు
‘దేశంలో ఫ్రాంటియర్ టెక్నాలజీ హబ్ ను ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆ ఫ్రాంటియర్ టెక్ హబ్ ను హైదరాబాద్ (Hyderabad City)లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే కేంద్రాన్ని కోరాం. ఇక్కడి అనుకూలతలను కేంద్రానికి ప్రత్యేకంగా వివరించాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం ’ అన్నారు.
‘పౌర సేవలను చివరి వ్యక్తి వరకు సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏఐ, బ్లాక్ చెయిన్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీలను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోబోతున్నాం. ఇటీవలి కాలంలో కీలకంగా మారిన డ్రోన్ టెక్నాలజీపై సైతం రాష్ట్ర యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తాం. వారికి అన్ని రంగాల్లో మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కసరత్తు చేస్తున్నాం’ అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
Also Read: KTR News: ఈసీకి లేఖ రాసి ఆపారు, ఏడాది పూర్తయినా ఎందుకిస్తలేరు- కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూటిప్రశ్న