Eatala Counters KCR: మాట్లాడితే అర్థం పర్థం ఉండాలే, కేసీఆర్‌కు ఏదో తప్పింది - సీఎం కామెంట్స్‌కు ఈటల కౌంటర్
Eatala Rajender Counter: సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. సీఎం వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివంటూ కొట్టిపారేశారు.
Bhadrachalam Floods: భద్రాచలంలో గోదావరి నదికి వచ్చిన వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరూ ఊహించని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వరదలపై విదేశీయుల కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బస్టింగ్ చేయడం వల్లే నది ఉప్పొంగి ప్రవహించిందని, వరదలు వచ్చాయని అన్నారు. అయితే, సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. సీఎం వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివంటూ కొట్టిపారేశారు. కేసీఆర్ కు ఏదో ఆర్డర్ తప్పినట్లుందని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడితే అర్థం ఉండాలి కానీ, ఏది పడితే అది మాట్లాడవద్దని ఈటల అన్నారు. వర్షం కురిపించడంలో విదేశీయుల కుట్ర ఎలా ఉంటుందని ఈటల ప్రశ్నించారు. గతంలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు మేఘ మథనం చేసినా వర్షాలు పడలేదన్న విషయాన్ని ఈటల రాజేందర్ గుర్తు చేశారు.
Also Read: In Pics: వరద బాధితుల వద్దకు కేసీఆర్, గోదావరికి శాంతి పూజలు - నీళ్లలో నుంచే సీఎం కాన్వాయ్
వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా భద్రాచలంలో గోదావరి నదిపై సీఎం కేసీఆర్ గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించారు. అనంతరం సీఎం, భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు.
భారీ వర్షాలను, వరదలను లెక్కచేయకుండా తమను పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ను చూసి భద్రాచలం వాసులు ఆశ్చర్యాలకు లోనయ్యారు. ద్రాచలంలో వరదలు వచ్చినపుడల్లా ప్రతిసారి ఇక్కడి ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
శాశ్వత ప్రాతిపదికన కాలనీల నిర్మాణం - కేసీఆర్
తరచుగా వరదల్లో మునిగిపోతున్న భద్రాచలం వాసుల కన్నీళ్లను తుడిచేందుకు సీఎం కేసీఆర్ వారికి శాశ్వత ప్రాతిపదికన నివాసాల కోసం కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తమకు శాశ్వత ప్రాతిపదికన రిలీఫ్ దొరకుతుండటంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.