Drugs Case: దేశంలోనే డ్రగ్స్ కింగ్ టోనీ అరెస్టు.. ప్రకటించిన హైదరాబాద్ సీపీ
గురువారం హైదరాబాద్ సీపీ విలేకరుల సమావేశం నిర్వహించి అరెస్టు చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
డ్రగ్స్ మాఫియాలో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న టోనీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముంబయిలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారని చెప్పారు. ముంబయి కేంద్రంగా డ్రగ్స్ నెట్‌వర్క్ నిర్వహిస్తున్న టోనీ.. దేశంలోని ముఖ్య పట్టణాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయిలలో డ్రగ్స్ సరఫరాకు ప్రత్యేక ముఠాలను ఇతను ఏర్పాటు చేసుకున్నాడని తెలిపారు. వీరిద్వారా హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని చెప్పారు. టోనీతోపాటు తొమ్మిది మంది డ్రగ్స్ వినియోగదారులను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. గురువారం హైదరాబాద్ సీపీ విలేకరుల సమావేశం నిర్వహించి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
‘‘దేశ వ్యాప్తంగా డ్రగ్స్ దందా నడుపుతున్న డ్రగ్స్ కింగ్ ‘పిన్ టోనీ’ని అరెస్ట్ చేశాం. ఇందుకోసం గత వారం రోజుల నుండి ముంబయిలో టాస్క్ ఫోర్స్ టీమ్ మకాం వేసింది. అంతకుముందు ఇబ్రాన్ బాబు షేక్ అనే డ్రగ్స్ సరఫరాదారును అరెస్ట్ చేశాం. అయితే, వెంటనే అతను టోనీతో వాట్సప్ చాట్ డిలీట్ చేశాడు. కాల్ లిస్ట్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని ఎట్టకేలకు టోనీని అరెస్ట్ చేశాం. 2013లో వీసాపై నైజీరియా నుంచి టోనీ ముంబయికి వచ్చాడు. వీసా ముగిసినా కూడా ముంబయిలోనే ఉంటున్నాడు. తొలుత గార్మెంట్స్ బిజినెస్ చేస్తూ ఉండేవాడు. టోనీ సహచరుల సలహాలతో డ్రగ్స్ దందా చేస్తూ వస్తున్నాడు. హైదరాబాద్‌కి చెందిన ఇబ్రాన్ బాబు షేక్, నూర్ మహమ్మద్ ఖాన్‌తో కలిసి ఈ డ్రగ్స్ దందా చేస్తున్నాడు.’’
‘‘ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందాలో టోనీ కీలక వ్యక్తి. మరో వ్యక్తి స్టార్ బాయ్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. సినిమాల్లో తరహాలో ఎవరికీ కనబడకుండా ఈ దందా చేస్తున్నాడు. రిమోట్ యాక్సిన్ ద్వారా పని చేస్తున్నాడు. ఈ డ్రగ్స్‌ను షిప్స్ ద్వారా ముంబయికి తీసుకొస్తున్నారు. టోనీతో సంబంధాలు కలిగిన 13 మంది సంపన్నుల వివరాలు బయటికి వచ్చాయి. ఈ టోనీతో సంబంధాలు పెట్టుకొని డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. న్యాయ నిపుణులను సంప్రదించి, పోలీస్ ఉన్నతాధికారులు సలహాల తీసుకొని డ్రగ్స్ తీసుకుంటున్న వారిపై కూడా కేసులు పెడుతున్నాం. ప్రస్తుతం 13 మందిలో 9 మందిని అరెస్ట్ చేశాం. రూ.వెయ్యి కోట్లు బిజినెస్ చేసే నిరంజన్ అనే బిజినెస్ మ్యాన్ 30 సార్లు డ్రగ్స్ తీసుకున్నాడని తేలింది. ఇంకా ప్రస్తుతం పట్టుబడ్డ వ్యక్తుల ద్వారా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా అవుతుందనే దానిపై విచారణ చేస్తున్నాం.’’ అని సీవీ ఆనంద్ వివరించారు.