Double Bedroom Houses: అక్టోబర్ 2, 5న మూడో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ-37 వేల మంది లబ్దిదారులు
హైదరాబాద్‌లో మూడో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పింపిణీకి సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 2, 5వ తేదీల్లో మరో 36వేల 884 మందికి ఇళ్ల పట్టాలు అందజేయనుంది తెలంగాణ ప్రభుత్వం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఇళ్ల పంపిణీ చేసిన తెలంగాణ ప్రభుత్వం... ఇప్పుడు మూడో విడతకు సిద్ధమైంది. వచ్చే నెల 2, 5 తేదీల్లో మూడో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం లక్కీ డ్రా నిర్వహించి.. 36వేల 884 మంది లబ్దిదారులను కూడా ఎంపిక చేశారు. వీరికి వచ్చే నెల 2వ తేదీ, 5 తేదీల్లో ఇళ్ల పంపిణీ జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు.
సొంతిల్లు పేదవారి కల. అది... హైదరాబాద్‌లో సొంతిల్లు అంటే... నిరుపేదలకు అందని ద్రాక్షే. అలాంటి కలను సాకారం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పేదలకు సొంతిల్లు కట్టించి ఇస్తోంది. ఇల్లు అంటే చిన్నా చితకా కాదు... రెండు బెడ్రూమ్‌లు, హాలు, కిచెన్‌తోపాటు... డ్రైనేజీ, విద్యుత్, వాటర్ వంటి అన్ని సౌకర్యాలతో ఒక కుటుంబానికి సరిపడా ఇళ్లను కట్టించి... పేదలకు ఉచితంగా అందిస్తోంది. నిరుపేదలు కూడా సొంత ఇంటిలో గౌరవంగా జీవించేలా చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్దిదారులకు అందించింది. రెండు విడతల్లో... 24వేల 900 ఇళ్లను పేదలకు పంపిణీ చేసింది. ఇప్పుడు మూడో విడతలో ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈనెల 27న ఆన్‌లైన్‌లో లక్కీ డ్రా నిర్వహించి.. మూడో విడత లబ్దిదారులను ఎంపిక చేశారు. వీరికి వచ్చేనెల 2, 5 తేదీల్లో ఇళ్ల పట్టాలు అందిచబోతున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఉచితంగా అందిస్తున్నరాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. ఇలాంటి పథకం.. దేశంలో మరెక్కడా లేదని చెప్పారు. మూడో విడత లబ్దిదారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు మంత్రి తలసాని శ్రీనివాయాదవ్. సొంత ఇల్లు లేని పేద, మద్యతరగతి ప్రజల కలను సాకారం చేయాలనే ఆలోచన్నది సీఎం కేసీఆర్ ఆశయని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. 96వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నట్టు చెప్పారాయన. ఇళ్ల పంపిణీలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శన పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేశామన్నారు. మొదటి విడతలో 11వేల 700 మందికి, రెండో విడతలో 13వేల 200 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇక మూడో విడత కోసం ఎంపికైన 36వేల 884 మందికి...వచ్చే నెల 2, 5 తేదీల్లో ఇళ్లు పంపిణీ చేస్తామన్నారు. వారికి ఎక్కడ ఇళ్లు కేటాయించేంది కూడా సమాచారం అందిస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.